9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

7 Nov, 2014 00:47 IST|Sakshi
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

ఆదివారం మధ్యాహ్నం 1:30కి ముహూర్తం!
గోవా సీఎం సహా 10 కొత్త ముఖాలకు చోటు
శివసేనకు రెండు పదవులు ఖాయం
టీడీపీకీ కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం

 
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. కేంద్రంలో మే నెలలో అధికారం చేపట్టాక తొలిసారి చేపట్టనున్న ఈ పునర్వ్యవస్థీకరణలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సహా 10 కొత్త ముఖాలకు మోదీ తన కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే పలువురు మంత్రుల శాఖల్లో మార్పుచేర్పులు చేయడంతోపాటు మిత్రపక్షాలైన టీడీపీ, శివసేనకు కూడా ఈ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులను మోదీ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేబినెట్ బెర్తుల కోసం శివసేన నుంచి ఇద్దరు ఎంపీల పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఇప్పటికే కోరినట్లు ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఈ నెల 11 నుంచి మోదీ 10 రోజులపాటు మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల పర్యటనకు వెళ్తుండటం, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భూటాన్ పర్యటన ముగించుకొని శనివారం స్వదేశం చేరుకోనుండటంతో ఆదివారం మధ్యాహ్నం 1:30కి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మూహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా, హర్యానాకు చెందిన జాట్ నేత బీరేందర్‌సింగ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఎంపీ అనురాగ్ ఠాకూర్, బీహార్‌కు చెందిన నేత గిరిరాజ్ సింగ్, రాజస్థాన్‌కు చెందిన కల్నల్ సోనారామ్ చౌధురి, గజేంద్రసింగ్ షెకావత్, మహారాష్ట్రకు చెందిన నేత హన్స్‌రాజ్ ఆహిర్‌ల పేర్లు మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్నాయి. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త సంస్థకు శివసేన నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభును అధిపతిగా నియమించి కేబినెట్ హోదా ఇవ్వొచ్చని తెలుస్తోంది. అలాగే ఆ పార్టీ నుంచి మరొకరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

మంత్రి పదవి స్వీకరిస్తా: పారికర్
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు రక్షణశాఖను కేటాయించే అవకాశం ఉందన్న వార్తలపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఎట్టకేలకు మౌనం వీడారు. కేంద్రంలో బాధ్యత (మంత్రి పదవి) స్వీకరించేందుకు సిద్ధమేనని గురువారం పణజీలో ప్రకటించారు. ప్రధాని అప్పగించే ఏ బాధ్యతనైనా అంగీకరించాల్సిందిగా బీజేపీ చీఫ్ అమిత్ షా సూచించారని... అందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు పణజీలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. ‘‘రాష్ట్రం నుంచి కేంద్రానికి మారడం నాకు పెద్దగా ఇష్టంలేదు. ఎందుకంటే... గోవాపై నాకు అవ్యాజ ప్రేమ ఉంది.

గోవాలో ఐదేళ్లపాటు పాలన సాగించాల్సిందిగా ప్రజలు తీర్పు ఇచ్చారు. పదవీకాలం పూర్తికాకుండా మధ్యలోనే వెళ్లడం సరికాదనేది నా భావన. కానీ దేశం నా సేవలు కోరుకుంటే ఆ బాధ్యత స్వీకరించాలని నా మనసు చెబుతోంది. అయితే గోవాకు నా సేవలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను అక్కడ ఉంటా’’ అని పారికర్ తెలిపారు. కాగా, పారికర్ శనివారం తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని... అదే రోజు ఆయన వారసుడి పేరును పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ప్రకటించనుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అదే రోజు నూతన సీఎం ప్రమాణస్వీకారం కూడా ఉంటుందని చెప్పాయి. మనోహర్ పారికర్ వారసుడిగా గోవా సీఎం రేసులో ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్‌తోపాటు అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర ఆర్లేకర్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు బీజేపీ నేత ఒకరు చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు