ఆ ‘ఫొటోల’తో దుమారం

15 Oct, 2019 17:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రీసైక్లింగ్‌కు పనికిరాని ప్లాస్టిక్‌ను నిషేధించాలని దేశ ప్రజలకు సందేశమిస్తూ అందుకు స్ఫూర్తిగా తమిళనాడులో మామల్లాపురం బీచ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్లాస్టిక్‌తోపాటు ఇతర చెత్తాచెదారాన్ని ఏరడం, ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను విడుదల చేయడం తెల్సిందే. చెనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, మోదీల మధ్య శనివారం జరిగిన చర్చల నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై రాద్ధాంతం చెలరేగింది. మోదీ చెత్తా చెదారాన్ని ఏరివేయడానికి ముందు, బాంబులను గుర్తించే స్క్వాడ్‌ వచ్చి ఆ బీచంతా తనిఖీ చేసిందని, అనంతరం కొంత మంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఆ బీచ్‌లో ఉద్దేశపూర్వకంగా చెత్తా చెదారాన్ని చల్లారని, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వచ్చి బీచ్‌లో చెత్తా చెదారాన్ని ఏరారని, అప్పటికే అక్కడ కెమెరాలు, లైట్లతో సిద్ధంగా ఉన్న వీడియో సిబ్బంది ఆ దృశ్యాన్ని చిత్రీకరించిందంటూ కొన్ని ఫొటోలు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

అందులో ఎంత వాస్తవం ఉంది ? చక్కర్లు కొడుతున్న మూడు, నాలుగు ఫొటోలు ఆ నాడు తీసినవేనా ? కనీసం అవన్నీ మామల్లాపురంకు చెందినవేనా? జాగ్రత్తగా గమనిస్తే అవి నకిలీవని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ప్రధాని పర్యటన సందర్భంగా బాంబు స్క్వాడ్‌ తనికీ చేయడం అన్నది సర్వ సాధారణం. మోడీ ఏరిన ప్లాస్టిక్, చెత్త కొంచెం మాత్రమే. ఆ కొంచెం బీచ్‌లో చల్లేందుకు అంత మంది పారిశుధ్ధ్య కార్మికులు, అన్ని సంచులతో అక్కడికి రారు. పైగా పారిశుద్ధ్య కార్మికుల్లా వారు కనిపించడం లేదు. పగట పూట మోదీ యాక్షన్‌ను చిత్రీకరించేందుకు సినిమా షూటింగ్‌ లాంటి లైట్లు అవసరం లేదు.

ఇలాంటి సందేహాలతోనే ఫొటోలను తనిఖీ చేయగా, వీడియా సిబ్బందిలా భావించిన ఫొటో స్కాట్‌లాండ్‌లోని, సెయింట్‌ ఆండ్రూస్‌ నగరంలోని ‘వెస్ట్‌ స్యాండ్స్‌’ బీచ్‌కు చెందినది. వీడియా సిబ్బందిలా భావిస్తున్నవారు. సినిమా సిబ్బంది. అక్కడ ఆ బీచ్‌లో దేశ దేశాల షూటింగ్‌లు తరచుగా జరుగుతాయి. అలాంటి ఓ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను ‘టేస్క్రీన్‌ డాట్‌ కామ్‌’ ఎన్నడో ప్రచురించింది. ఇక బాంబ్‌ స్క్వాడ్‌ బీచ్‌ను తనిఖీ చేస్తున్న దశ్యం ఫొటో కేరళలోని కోజికోడ్‌ బీచ్‌కు చెందినది. 2019 లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ఏప్రిల్, 23న మోదీ ఎన్నికల సభ సందర్భంగా తనిఖీ చేసినప్పటి చిత్రం. ఇక బీచ్‌లో చెత్త పారేస్తున్నట్లు భావిస్తున్నవారు వాస్తవానికి చెత్త ఏరుతున్నారు. అది ఎక్కడి ఫొటోనో, ఎవరి ఫొటోను తెలియలేదు. అయితే స్వచ్ఛంద కార్యకర్తలు బీచ్‌ను శుభ్రం చేస్తున్న ఫొటోగా అది అర్థం అవుతోంది. మోదీ తన వీడియో క్లిప్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మోదీ దుష్ప్రచారానికి సంబంధించిన ఫొటోలు విడుదలవడంతో అవి వేగంగా సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. మోదీకి వ్యతిరేకంగా మొదట తమిళనాడులోని శివగంగ కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం మూడు ఫొటోలను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అందులో రెండు ఫొటోలు బీచ్‌లో మోదీ చెత్తా చెదారాన్ని ఏరివేస్తున్నవి కాగా, ఆ దశ్యాలను చిత్రీకరిస్తున్న వీడియా సిబ్బంది అంటూ మరో చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఆ తర్వాత కొంత సేపటికి ‘రోఫి రిపబ్లిక్‌’ నాలుగు ఫొటోలను పోస్ట్‌ చేసింది. 1. బీచ్‌ను తనిఖీ చేస్తున్న బాంబ్‌ స్క్వాడ్, 2.ఆ తర్వాత చెత్త వేస్తున్న దశ్యం, 3. కెమేరాలు సర్దుకున్న వీడియో సిబ్బంది, 4. ఏరుతున్న మోదీకి ఆస్కార్‌....అంటూ వ్యాఖ్యానాలు కూడా చేసింది.

ఈ నకిలీ ఫొటోల దుష్ప్రచారంతో సంబంధం లేకుండానే ప్రధాని మోదీ యాక్షన్‌ కృతకంగా ఉందని, వ్యక్తిగత ప్రచారం కోసమే ఈ ఆర్భాటం అన్న వాళ్లు, ప్రజలకు స్ఫూర్తినివ్వడానికి ఆ మాత్రం యాక్షన్‌ ఉండాల్సిందే అంటున్న వాళ్లు లేకపోలేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా