లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక భేటీ

1 May, 2020 11:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీతో అయ్యారు. ఈ ప్రధాన భేటీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, పీయుష్‌ గోయల్‌తో పాటు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కూడా పాల్గొన్నారు. (లాక్‌డౌన్‌ : తెలంగాణ నుంచి తొలి ట్రైన్‌)

లాక్‌డౌన్‌పై అనుసరించాల్సిన వ్యూహాలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కరోనాపై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్‌ చేయడమే మేలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ శనివారం ప్రసంగంలో చర్చించే అవకాశం ఉంది. ఇక వైరస్‌ ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తూ కొత్తగా రెడ్‌, ఆరెంజ్‌ జోన్లను కేంద్రం గుర్తించిన విషయం తెలిసిందే. (ఠాక్రేకు గుడ్‌న్యూస్‌ : ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌)

>
మరిన్ని వార్తలు