పరీక్షాపత్రాల లీక్‌.. ప్రధాని ఆగ్రహం!

28 Mar, 2018 19:50 IST|Sakshi

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షాపత్రాలు లీక్‌ కావడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో మాట్లాడి.. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాలను లీక్‌చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవలని ప్రధాని స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విలేకరులతో మాట్లాడారు. సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను వాట్సాప్‌లో లీక్‌ చేశారని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రశ్నాప్రతాల లీకేజ్‌ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదుచేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలా పరీక్షాపత్రాలు లీక్‌ కాకుండా యంత్రాంగం అందుబాటులోకి రావాల్సి ఉందని, ఇందులో భాగంగా పరీక్షాపత్రాలు పంపిణీ చేసే సమయంలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని నిర్ణయించామని జవదేకర్‌ తెలిపారు.

ఇటీవల జరిగిన పదో తరగతి మ్యాథమెటిక్స్, 12వ తరగతి ఎకనామిక్స్‌ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకైనట్టు వెలుగుచూసిన నేపథ్యంలో ఆ రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షల తేదీని తమ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.

మరిన్ని వార్తలు