రేపటి నుంచి మోదీ యాత్ర

7 Jun, 2019 02:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నుంచి శ్రీలంక, మాల్దీవుల్లో పర్యటించనున్నారు. పొరుగు దేశాలతో సంబంధాల బలోపేతమే మొదటి ప్రాధాన్యమన్న ప్రభుత్వ విధానానికి ఇది కొనసాగింపు అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జూన్‌ 8వ తేదీన మొదటగా మాల్దీవులు వెళ్లనున్న ప్రధాని ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు.  రెండు దేశాలు పరస్పర సహకారం పెంచుకునేందుకు      పలు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. అనంతరం 9వ తేదీన ప్రధాని శ్రీలంక వెళతారు. ఈస్టర్‌ పేలుళ్ల అనంతరం ద్వీపదేశంలో పర్యటించనున్న మొదటి ప్రధాని మోదీయే.   ఆ దేశానికి సంఘీభావం ప్రకటిస్తారని తెలపడమే ఈ పర్యటన ఉద్ధేశమని గోఖలే అన్నారు. ఇందులో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర ముఖ్య నేతలతో మోదీ భేటీ అవుతారు.

ప్రధాని మోదీ దక్షిణాది తీర్థయాత్ర
కోచి/తిరుపతి: ఈ వారాంతంలో  గురువాయూరు, తిరుమల ఆలయాలను సందర్శించుకోనున్నారు. శనివారం కేరళలోని గురువాయూరులో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం, ఆదివారం ఏపీలోని తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో ప్రధాని పూజలు చేయనున్నారు.   ఆదివారం సాయంత్రం విమానంలో కొలంబో నుంచి తిరుమల దగ్గర్లోని రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లి, పూజల అనంతరం రాత్రికి తిరిగి ఢిల్లీ వెళతారని అధికారులు తెలిపారు. ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కూడా ఉంటారని భావిస్తున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయన సందర్శించే మొదటి ఆలయం తిరుమల కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు