డిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం

26 Apr, 2015 03:58 IST|Sakshi
డిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్లో శనివారం ప్రయాణించారు. దౌలాకువా స్టేషన్ నుంచి ద్వారకా వరకు ఆయన మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ప్రారంభించడం కోసం వెళ్తూ ఆయన మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రధాని వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.
 
  భద్రతా ఏర్పాట్ల కారణంగా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందిని కలుగుతుందనే ప్రధాని మెట్రోలో ప్రయాణించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించాల్సిందిగా శ్రీధరన్ తనకు ఎప్పుడూ చెబుతుండేవారని ప్రధాని మెట్రో ప్రయాణం తరువాత ట్వీట్ చేశారు. ఈ రోజు ద్వారకా ప్రయాణం సందర్భంగా తనకు ఈ ఆవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణాన్ని తాను నిజంగా ఆస్వాదించినట్లు వివరించారు.
 
  అయితే ప్రధాని మెట్రో పర్యటనపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హర్షం వ్యక్తం చేశారు. నిత్యం మెట్రోలో ప్రయాణించే చాలా మంది మాదిరిగానే ప్రధాని ప్రయాణించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తన ప్రయాణం ద్వారా మెట్రోను ప్రజలు తరచుగా వాడాలన్న సందేశాన్ని పంపించారన్నారు. మోదీ తన సహచరులకు సైకిల్ వాడాలన్న సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు