‘సోషల్‌ ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితి

9 Apr, 2020 04:31 IST|Sakshi
పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

లాక్‌డౌన్‌ను కొనసాగించాలని సూచనలు వస్తున్నాయి

వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ‘సామాజిక అత్యవసర పరిస్థితి(సోషల్‌ ఎమర్జెన్సీ)’ తరహా అసాధారణ స్థితి నెలకొని ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా నెలకొన్న ఈ స్థితి వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రతీ ప్రాణాన్ని కాపాడటమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా అప్రమత్తతను కొనసాగించాలని కోరారు. పార్లమెంట్‌లోని విపక్ష, ఇతర పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతల సూచనలను స్వీకరించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏప్రిల్‌ 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కొన్ని రాష్ట్రాలు, జిల్లా స్థాయి అధికారులు, ఇతర నిపుణులు సూచిస్తున్నారని ప్రధాని ఆ భేటీలో వివరించారు.  లాక్‌డౌన్‌ను కొనసాగించాలనే నిర్ణయానికి సంబంధించి ఈ సమావేశంలో ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు పలువురు నేతలు ఆ తరువాత తెలిపారు.  

కరోనా కారణంగా దేశంలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని  స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తి వేగాన్ని భారత్‌ విజయవంతంగా అడ్డుకోగలిగిందన్నారు. మానవ జాతి చరిత్రలోనే ప్రస్తుత స్థితి ఒక కీలక మలుపు అని, దీని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో.. పని సంస్కృతి, పని విధానాల్లో మార్పు తీసుకువచ్చేందుకు అంతా కృషి చేయాలని ప్రధాని సూచించారు. కరోనా మహమ్మారిపై పోరులో పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటిగా కలిసివచ్చి నిర్మాణాత్మక, సానుకూల రాజకీయాలు చేయడాన్ని దేశం చూసిందని వ్యాఖ్యానించారు. ఈ కష్ట సమయంలో ప్రజలు కూడా ఎంతో నిబద్ధత, క్రమశిక్షణతో వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. భౌతిక దూరం పాటించడంలో, జనతా కర్ఫ్యూను, లాక్‌డౌన్‌ను పాటించడంలో ప్రజలు ప్రశంసనీయ ధోరణి ప్రదర్శించారన్నారు. కరోనాపై పోరులో కేంద్రానికి అన్ని రాష్ట్రాలు అద్భుతంగా సహకరించాయని ఆయన కొనియాడారు.  

తగినన్ని పీపీఈలు అందుబాటులో ఉంచాలి
లాక్‌డౌన్‌ను కొనసాగించే విషయంపై, లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితులను ఎదుర్కొనే విషయంపై ఈ భేటీలో పలువురు నేతలు ప్రధానికి పలు సూచనలు చేశారు. కరోనాపై పోరులో ముందున్న వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని, నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదుకోవాలని కోరారు. వైద్య సిబ్బందికి తగినన్ని పీపీఈలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి విరమించుకోవాలని పలువురు సూచించారు.

ఆర్థికరంగం సహా పలు రంగాల్లో పునరుత్తేజానికి తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలను వారు ప్రధానికి వివరించారు.  ఈ భేటీలో కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, రామ్‌గోపాల్‌ యాదవ్‌(ఎస్పీ), సతీశ్‌ మిశ్రా(బీఎస్పీ), చిరాగ్‌ పాశ్వాన్‌(లోక్‌జనశక్తి పార్టీ), టీఆర్‌ బాలు(డీఎంకే), సంజయ్‌ రౌత్‌(శివసేన).. తదితరులు పాల్గొన్నారు. తొలుత నిరాకరించినప్పటికీ.. టీఎంసీ తన ప్రతినిధిగా సుదీప్‌ బంధోపాధ్యాయను పంపించింది.

ఒకేసారి ఎత్తేయబోం: ఏప్రిల్‌ 14 తరువాత లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేసే ఆలోచన లేదని పార్టీల ఫ్లోర్‌ లీడర్ల సమావేశంలో ప్రధాని స్పష్టం చేశారని బీజేపీ నేత పినాకి మిశ్రా వెల్లడించారు. కరోనా ముందు, కరోనా తరువాత పరిస్థితులు ఒకేలా ఉండబోవని ప్రధాని వ్యాఖ్యానించారన్నారు.

శనివారం సీఎంలతో కాన్ఫరెన్స్‌
ప్రధాని మోదీ ఈ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత సహా కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పలు రాష్ట్రాలు, ఇతర నిపుణులు కోరుతున్న నేపథ్యంలో ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ విషయంపై ప్రధాని స్పష్టత ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు