‘డ్రాగన్‌కు దీటుగా బదులిచ్చాం’

28 Jun, 2020 11:36 IST|Sakshi

మన్‌ కీ బాత్‌లో ప్రధాని

సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదంలో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. డ్రాగన్‌ సేనలతో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికుల త్యాగాలను కొనియాడారు. మనం సుఖంగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారని ప్రస్తుతించారు. ప్రధాని మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ లడఖ్‌లో చైనా సైనికులను దీటుగా నిలువరించామని అన్నారు. దేశం స్వయం సమృద్ధి సాధించేలా పౌరులంతా చొరవ చూపాలని పిలుపు ఇచ్చారు.

స్ధానిక ఉత్పత్తుల వాడకానికే మొగ్గుచూపాలని కోరారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్‌ బలోపేతమవుతోందని అన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం భారత్‌ పాటుపడుతోందని చెప్పారు. కోవిడ్‌ నియమాలను అనుసరించకుంటే ప్రమాదంలో పడతామని హెచ్చరించారు. ఈ ఏడాది మనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని అన్నారు. ప్రపంచమంతా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించగా, ఇమ్యూనిటీని పెంచేవన్నీ భారత్‌లో ఎప్పటినుంచో వాడుతున్నవేనని గుర్తించాలన్నారు.

పీవీకి నివాళి

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ రాజకీయాలపై పట్టుతో పాటు పాశ్చాత్య ఆలోచనల్లో బాగా ప్రావీణ్యం కలవారు పీవీ నరసింహారావని కొనియాడారు. చరిత్ర, సాహిత్యం, విజ్ఞానశాస్త్రంలో ఆయనకు చాలా ఆసక్తి. భారతదేశపు అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరైన పీవీకి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. సంక్లిష్ట సమయంలో దేశానికి నాయకత్వం వహించిన పీవీ గొప్ప రాజకీయ నేతే కాకుండా పండితుడని అన్నారు. చదవండి : భారత్‌ గట్టిగా పోరాడుతోంది: మోదీ

మరిన్ని వార్తలు