‘పౌర చట్టంపై విపక్షాల రాద్ధాంతం’

12 Jan, 2020 14:11 IST|Sakshi

కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కోల్‌కతాలో ఆదివారం రెండోరోజు పర్యటనలో భాగంగా రామకృష్ణ మిషన్‌ కేంద్ర కార్యాలయంలో విద్యార్ధులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ నూతన పౌరసత్వ చట్టం ఏ ఒక్కరి పౌరసత్వాన్ని లాగేసుకోదని స్పష్టం చేశారు. పొరుగు దేశాల నుంచి వలసవచ్చిన మైనారిటీ శరణార్ధులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిందేనని చెప్పుకొచ్చారు. మీరు అర్ధం చేసుకున్న మాదిరిగా కూడా విపక్షాలు సమస్యను అవగతం చేసుకోలేదని ఆయన మండిపడ్డారు.

పౌరసత్వ చట్టంపై ప్రభుత్వం పలుమార్లు వివరణ ఇచ్చినా స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో విపక్షాలు ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నాయని అన్నారు. పాకిస్తాన్‌లో మైనారిటీలు ఎదుర్కొంటున్న వేధింపులు ఇప్పుడు ప్రపంచానికి తెలిశాయని, 50 ఏళ్లుగా తమ దేశంలో మైనారిటీలను ఎందుకు వేధిస్తున్నదో పాకిస్తాన్‌ ప్రపంచానికి తెలియచేయాల్సి ఉందని నిలదీశారు. ఈ చట్టం ఈశాన్య ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కల్పించదని ప్రధాని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద జయంతోత్సవాల సందర్భంగా రామకృష్ణ మఠానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు