-

‘కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నాం’

16 Jun, 2020 17:27 IST|Sakshi

రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ

సాక్షి, న్యూఢిల్లీ :  రాష్ట్రాల సహకారంతో కరోనా వైరస్‌పై భారత్‌ దీటుగా పోరాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్‌-19 బారినపడి కోలుకునే వారి సంఖ్య 50 శాతం దాటిందని వెల్లడించారు. మహమ్మారిపై పోరు మన సహకార సమాఖ్య విధాన స్ఫూర్తిని చాటిందని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ కరోనా మహమ్మారితో మెరుగ్గా పోరాడుతోందని, మనపై మహమ్మారి ప్రభావం కొంతమేర తక్కువేనని చెప్పుకొచ్చారు. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి, లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై ప్రధాని మంగళవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. జూన్‌ 30తో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో చేపట్టాల్సిన చర్యలపై సీఎంలతో చర్చించారు.

గత కొద్దివారాలుగా పలు దేశాల నుంచి పెద్దసంఖ్యలో భారతీయులు, వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్నారని చెప్పారు. సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం పలు సడలింపులు ప్రకటించిన అనంతరం ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయని అన్నారు.  మార్కెటింగ్‌ విధానంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రైతుల ఆదాయం మెరుగుపడటమే కాకుండా వారి ఉత్పత్తులను గిట్టబాటు ధరలకు విక్రయించేలా తోడ్పడుతుందని చెప్పారు. స్ధానిక ఉత్పత్తులను గుర్తించి, అక్కడే ప్రాసెస్‌ చేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. ఈ సమావేశంలో పంజాబ్‌, కేరళ, గోవా, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ సహా పలు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

చదవండి : లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం స్పందన

మరిన్ని వార్తలు