జకీర్‌ నాయక్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

19 Sep, 2019 13:06 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇస్లాం బోధకుడు జకీర్‌ నాయక్‌పై మనీల్యాండరింగ్‌ కేసులో పీఎంఎల్‌ఏ కోర్టు గురువారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ఈడీ పిటిషన్‌పై వారెంట్‌ను జారీ చేశారు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న తాను కోర్టు ఎదుట హాజరయ్యేందుకు రెండు నెలల గడువు కోరుతూ గత వారం నాయక్‌ దాఖలు చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. తన విద్వేష ప్రసంగాలతో జకీర్‌నాయక్‌ భారత్‌లో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టాడని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నాడని ఆయనపై అభియోగాలున్నాయి.

జులై 2016లో ఢాకాలోని హోలీ ఆర్టిసాన్‌ బేకరీపై జరిగిన ఉగ్రదాడి కేసులో జకీర్‌ నాయక్‌ అప్పగింత కోసం భారత్‌, బంగ్లాదేశ్‌లు వేచిచూస్తున్నాయి. భారత్‌ ఇప్పటికే నాయక్‌ పాస్‌పోర్టును రద్దు చేసి ఆయనను నేరస్తుడిగా ప్రకటించింది. తనకు శాశ్వత నివాసి హోదాను ఇచ్చిన మలేషియాలోనే ఆయన మూడు సంవత్సరాలుగా ఉంటున్నారు. నాయక్‌ను అప్పగించాలని మలేషియాతో భారత్‌ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. కాగా ఈస్ర్టన్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల నేపథ్యంలో తమ మధ్య జరిగిన సమావేశంలో జకీర్‌ నాయక్‌ అప్పగింత వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించలేదని మలేషియా ప్రధాని మహతిర్‌ బిన్‌ మహ్మద్‌ పేర్కొన్న అనంతరం కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు