బ్లాక్‌మనీ వివరాల వెల్లడికి పీఎంవో నిరాకరణ

26 Nov, 2018 09:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన నల్లధన వివరాలు వెల్లడించడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నిరాకరించింది. ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వివరాలు బహిర్గతమైతే దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున వెల్లడించలేమని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సెక్షన్‌ 8 (1) (హెచ్‌) ప్రకారం దర్యాప్తునకు ఆటంకం కలిగే సమాచార వెల్లడికి మినహాయింపు ఉందంటూ.. ఈ విషయమై తమ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు సాగిస్తున్నట్లు వివరించింది.

అక్టోబర్‌ 16న సీఐసీ జారీ చేసిన ఆదేశాలకు పీఎంవో ఈ మేరకు సమాధానం ఇచ్చింది.  అయితే, అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రిటీ (జీఎఫ్‌ఐ) సంస్థ అధ్యయనం ప్రకారం.. 2005–14 మధ్య రూ.5.44 లక్షల కోట్ల నల్లధనం అక్రమంగా దేశంలోకి రాగా, రూ.1.16 లక్షల కోట్లు విదేశాలకు తరలిపోయింది.   

మరిన్ని వార్తలు