ప్రధాని మోదీ కారుకు ప్రమాదం

23 May, 2016 20:02 IST|Sakshi
ప్రధాని మోదీ కారుకు ప్రమాదం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కారు ప్రమాదానికి గురైంది. అసోం ముఖ్యమంత్రిగా ఎంపికైన సర్వానంద సోనోవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం జరుగుతున్న రిహార్సల్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని ఉపయోగించాల్సిన బీఎండబ్ల్యు కారు 37వ నంబరు జాతీయరహదారిపై కాన్వాయ్‌లో వెళ్తోందని గువాహటి డీసీపీ (ట్రాఫిక్‌) ప్రణబ్ జ్యోతి గోస్వామి తెలిపారు. రిహార్సల్స్ సమయంలో ఈ కారు కాన్వాయ్‌లో దాని ముందున్న మరో కారును ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు గానీ, బీఎండబ్ల్యు కారు ముందున్న స్టీలు ఫ్రేమ్, బానెట్ బాగా దెబ్బతిన్నాయి.

ముందున్న కారు సడన్ బ్రేకు వేయడంతో వెనకాలే వస్తున్న బీఎండబ్ల్యు డ్రైవర్ దాన్ని గమనించడంలో కొద్దిగా ఆలస్యమై ఈ ప్రమాదం సంభవించింది. ప్రధాని ప్రత్యేక భద్రతా బృందం ఈ కారును పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి వేరే కారు తెప్పించాలా అక్కర్లేదా అనే విషయమై నిర్ణయం తీసుకుంటారు. మంగళవారం గువాహటిలో జరిగే సోనోవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు పాల్గొంటారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా