ప్యాకేజీ ఒక క్రూయల్ జోక్‌ : సోనియా

22 May, 2020 16:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మార్చిన 24న కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారని, ఎలాంటి సంసిద్ధత లేకుండానే లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు. అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని గుర్తు చేశారు.

21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నామని, ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం 4 లాక్‌డౌన్లు అమలు చేసినా, కరోనా మహమ్మారి నుంచి బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోందని ధ్వజమెత్తారు. వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయన్నారు.

టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ఈలోగా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక క్రూయల్ జోక్‌గా నిలిచిందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు