వైరల్‌ అవుతున్న పోలీసు కమీషనర్‌ వీడియో

11 Mar, 2018 12:25 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు : కనిపించని నాలుగో సింహం పోలీస్‌ అంటే మనలో చాలా మందికి భయం. ఇంక వారితో మాట్లాడాలంటే కొంతమంది బెంబేలెత్తిపోతారు. కానీ ఓ విద్యార్థి మాత్రం పోలీసు అధికారిని చూడగానే గౌరవంతో సెల్యూట్‌ చేశాడు. సిబ్బందితో కలిసి వెళ్తూ.. హడావిడిలో ఉన్న ఆ అధికారి కూడా హుందాగా స్పందించాడు. ఆ విద్యార్థి సెల్యూట్‌ను గమనించి.. వెంటనే  ప్రతి సెల్యూట్‌ చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

నగరంలోని మాల్య ఆస్పత్రి వద్ద ఈ అరుదైన ఘటన జరిగింది. బెంగుళూరు పోలీసు కమిషనరు టీ. సునీల్‌ కుమార్‌ మాల్య ఆస్పత్రి ముందు నుంచి వెళ్తున్నారు. కమిషనర్‌ను గమనించిన ఓ పాఠశాల విద్యార్థి గౌరవ సూచకంగా ఆయనకు సెల్యూట్‌ చేశాడు. తన సిబ్బందితో కలసి వెళ్తున్న కమిషనర్‌ ఇది గమనించి.. వెంటనే ఆ బాలునికి ప్రతి సెల్యూట్‌ చేశారు. ఇదంతా అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. ‘ఒక యూనీఫామ్‌ మరో యూనీఫామ్‌కి ఇచ్చిన గౌరవం క్రమశిక్షణను సూచిస్తుంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 1500 మంది షేర్‌ చేశారు. 80,000 వ్యూస్‌ వచ్చాయి.

మరిన్ని వార్తలు