జేయూలోనూ జేఎన్‌యూ రగడ‌..

7 Jan, 2020 08:02 IST|Sakshi

కోల్‌కతా : జేఎన్‌యూ ఘటనపై జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్ధులు, బీజేపీ కార్యకర్తలు సోమవారం సాయంత్రం బాహాబాహీకి దిగడంతో జేయూ రణరంగమైంది. నగరంలోని జనసమ్మర్థ సులేఖ మోర్‌ ప్రాంతం వద్ద ఇరు వర్గాలు ఎదురుపడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్ధులు, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు తలపడటంతో కోల్‌కతా పోలీసులు లాఠీచార్జి జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు తమపై లాఠీచార్జి జరిపి భాష్పవాయుగోళాలను ప్రయోగించారని జేయూ విద్యార్ధులు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటల పాటు రహదారిని నిర్భందించిన అనంతరం స్ధానిక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, విద్యార్ధినులను తోసివేశారని జేయూ విద్యార్ధులు ఫిర్యాదు చేశారు.

పోలీసుల వ్యవహారశైలిపై డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ బహిరంగ క్షమాపణలు కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. అంతకుముందు జేయూ విద్యార్ధులు జేఎన్‌యూ ఘటనను నిరసిస్తూ క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్ధులకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు వర్సిటీ మీదుగా జాదవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న జేయూ విద్యార్ధులు పెద్ద  సంఖ్యలో క్యాంపస్‌ వెలుపలకు వచ్చి బీజేపీ ప్రదర్శనను అడ్డుకునేందుకు సిద్ధపడ్డారు. విద్యార్ధులు బీజేపీ జెండాను దగ్ధం చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు బారికేడ్లను దాటి విద్యార్ధులపైకి రావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

మరిన్ని వార్తలు