ఒత్తిడే ఆత్మహత్యకు దారితీసిందా?

3 Aug, 2019 08:13 IST|Sakshi
సిద్ధార్థ భార్య మాళవిక,కుటుంబ సభ్యులు

కాఫీ కింగ్‌ సిద్ధార్థ మరణంపై పోలీసుల ఆరా

కర్ణాటక  ,బొమ్మనహళ్లి : కాఫీ కింగ్, కేఫ్‌ కాఫీడే అధినేత, మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దేశ విదేశాల్లో సైతం వ్యాపారం చేస్తున్న సిద్ధార్థ తన వ్యాపారం కోసం పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో అప్పలు తీర్చడం కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఓ అధికారి సిద్ధార్థను తీవ్రంగా వేధించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆయన వేధింపులు తాళలేకనే సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృదు స్వభావిగా పేరున్న సిద్ధార్థ షేర్‌ మార్కెట్‌లో రోజు రోజుకు తన కంపెనీ షేర్లు పడిపోవడంతో ఆయన కొంతమేర ఆందోళన పడ్డారని, అప్పులు పెరిగిపోవడం, మరొవైపు వేధింపులు ఆయనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయని సిబ్బంది భావిస్తున్నారు. గత సోమవారం ఉదయం బెంగళూరు నుంచి మంగళూరు వైపు వెళ్లిన సిద్ధార్థ ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు, ఆ మొబైల్‌ నెంబర్ల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిద్ధార్థ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత అది హత్య, లేక ఆత్మహత్య అనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.   

చేతనహళ్లిలో కమ్ముకున్న విషాద ఛాయలు
కాఫీ కింగ్‌ వీజీ సిద్ధార్థ మరణించి మూడు రోజులు గడచినా కూడా ఆయన స్వగ్రామం అయిన చేతనహళ్లిలో స్థానికులు ఆయనను మరిచిపోలేకున్నారు. సిద్ధార్థ తిథి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ భార్య మాళవిక, కుమారులు అమర్థ్య, ఇషాన్‌ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరో పక్క సిద్ధార్థకు చెందిన ఎస్టేట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, కార్మికులు సైతం తిథి కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ యజమానిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు.  

మరిన్ని వార్తలు