ఫొటో జర్నలిస్టుపై రేప్ కేసులో.. 600 పేజీల చార్జిషీట్

20 Sep, 2013 04:27 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర సహా దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు 600 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నలుగురిపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వీటిని సమర్పించారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో అతనికి సంబంధించిన అభియోగ పత్రాలను జువెనైల్ జస్టిస్‌కు అందజేసినట్టు ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్(క్రైం) హిమాంశు రాయ్ గురువారం చెప్పారు. నిందితులపై భారత శిక్షా స్మృతి కింద 506(2)-నేర స్వభావం, 376(డి)- గ్యాంగ్‌రేప్, 377- అసహజ నేరం, 342-అక్రమ నిర్బంధం, 341-అక్రమ నిరోధం, 201-సాక్ష్యాలను ధ్వంసం చేయడం, 120(బి)-నేర పూరిత కుట్ర, 34-ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడడం వంటి సెక్షన్లను నమోదు చేశారు. దీనిపై త్వరలోనే విచారణ ప్రారంభం కానుందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు