పోలీసు బలగాలకు అన్నీ కొరతే

27 Aug, 2019 16:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పోలీసు బలగాల ఆధునీకరణ కోసం కేంద్రం 2019–2020 వార్షిక బడ్జెట్‌లో గత ఏడాది కన్నా ఎనిమిది శాతం నిధులను పెంచింది. టెలిఫోన్స్, వైర్‌లెస్‌ డివైసెస్, వాహనాలు, ఆధునిక ఆయుధాల కోసం ఈ నిధులను వినియోగించాలని, మ్యాచింగ్‌ గ్రాంట్‌లను విడుదల చేసిన వెంటనే గ్రాంటులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమని ప్రకటించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు బలగాల ఆధునీకరణకు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. పోలీసు బలగాల ఆధునీకరణ నిధులు ఏడాదికేడాది మురుగి పోతున్నాయి.

‘బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ ప్రకారం దేశంలోని 267 పోలీసు స్టేషన్లకు టెలిఫోన్‌ సౌకర్యం లేదు. 129 స్టేషన్లకు వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ పరికరాలు లేవు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పెట్రోలింగ్‌ జరపడానికి, ఆపదలో ఉన్నాం, ఆదుకొనమని ఫోన్లు వస్తే స్పందించేందుకు ప్రతి వంద మంది పోలీసులకుగాను ఎనిమిది వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2012 నాటికి దేశంలో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ పరికరాలు లేని పోలీసు స్టేషన్లు 39 ఉండగా, 2016 నాటికి వాటి సంఖ్య 129కి చేరుకున్నాయి. 2017 సంవత్సరం నాటికి దేశంలో 273 పోలీసు స్టేషన్లకు ఒక్క వాహనం కూడా లేదు. మణిపూర్‌లో 30, జార్ఖండ్‌లో 22, మేఘాలయ 18 పోలీసు స్టేషన్లకు వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ డివైస్‌ ఒక్కటి కూడా లేదు.

2012లో టెలిఫోన్‌ సదుపాయంలేని పోలీసు స్టేషన్లు 296 ఉండగా, 2017 నాటికి వాటి సంఖ్య 269కి తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లోని 51 పోలీసు స్టేషన్లు, బీహార్‌లోని 41 స్టేషన్లకు, పంజాబ్‌లో 30 పోలీస్‌ స్టేషన్లకు టెలిఫోన్‌ సౌకర్యం లేదు. ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో క్రైమ్‌ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు స్టేషన్ల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక ఆయుధాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆత్యాధునిక ఆయుధాలను పక్కన పెడితే సాధారణ తుపాకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. పశ్చిమ బెంగాల్‌కు 71 శాతం, కర్ణాటకకు 37 శాతం, పంజాబ్‌కు 36 శాతం ఆయుధాల కొరత ఉంది. పోలీసు బలగాల ఆధునీకరణ కోసం 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు రాగా, అందులో 38.31 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరుకాగా, 32.99 కోట్ల రూపాయలు మాత్రమే ఉపయోగించినట్లు ఐదు రాష్ట్రాల బడ్జెట్‌ను 2014 నుంచి 2018 వరకు సమీక్షించిన కాగ్‌ వెల్లడించింది. దాదాపు మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

>
మరిన్ని వార్తలు