పౌర రగడ: పోలీసులకు బుల్లెట్‌ గాయాలు

4 Jan, 2020 11:29 IST|Sakshi

పౌరసత్వ నిరసనల్లో 57 మంది పోలీసులకు బుల్లెట్‌ గాయాలు

లక్నో: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ప్రజలు, విద్యార్థులు రోడ్లమీదికి వచ్చి తీవ్రంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. పలు చోట్ల ఆందోళకారులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో బుల్లెట్‌ గాయాలైన పోలీసుల జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు. సుమారు 300 మంది పోలీసు సిబ్బంది గాయపడగా, అందులో 57 మందికి బుల్లెట్‌ గాయాలైనట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే గాయపడ్డ పోలీసు వివారాలను మాత్రం గోప్యంగా ఉంచారు. అలాగే గత నెలలో రాష్ట్రంలో జరిగిన నిరసన ఘటనల్లో 21 మంది ఆందోళనకారులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై వివరాలు వెల్లడించిన ముజఫర్‌నగర్‌ పోలీసు సూపరింటెండెండ్‌ సత్పాల్‌ ఆంటిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన కాలుకు జరిగిన బుల్లెట్‌ గాయాన్ని చూపించారు. ‘నేను నిరసనలను అదుపు చేయడానికి మీనాక్షి చౌక్‌ వద్ద పోలీసు బృందంతో ఉన్నాను . ఆ సమయంలో ఏం జరిగిందో అర్థంకాలేదు. బుల్లెట్‌ గాయంతో నా కాలు తీవ్ర రక్తస్రావం అయింది’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమారు 200 మంది నిరసనకారులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: వెనక్కితగ్గం
చదవండి: పౌర నిరసనలతో రూ 1000 కోట్ల నష్టం

మరిన్ని వార్తలు