ఐపీఎల్‌ బెట్టింగ్‌లో అర్బాజ్‌ఖాన్‌

2 Jun, 2018 03:27 IST|Sakshi
అర్బాజ్‌ఖాన్, సోనూ యోగేంద్ర, దావూద్‌ ఇబ్రహీం

తాజా సీజన్‌లో 2.8 కోట్లు నష్టపోయిన సల్మాన్‌ సోదరుడు

డీగ్యాంగ్‌ బుకీ సోనూ అరెస్టుతో వెలుగులోకి

జాబితాలో బాలీవుడ్‌ నటులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు?  

ముంబై/థానే: 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్‌ కేసు విచారణలో భాగంగా లాగిన తీగతో భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ డొంక కదిలింది.  2008 ఐపీఎల్‌ బెట్టింగ్‌కు సంబంధించిన కేసులో దావూద్‌ అనుచరుడు, హైప్రొఫైల్‌ బుకీ సోనూ యోగేంద్ర జలన్‌ను అరెస్టు చేసి విచారించగా ఏటా ఐపీఎల్‌లో జరుగుతున్న బెట్టింగ్‌ వ్యవహారంతో పాటు తాజా సీజన్‌లో చేతులు మారిన కోట్ల రూపాయలు, భాగస్వాములైన బాలీవుడ్‌ ప్రముఖుల వివరాలూ వెల్లడయ్యాయి. గతవారం ముగిసిన 11వ సీజన్‌ ఐపీఎల్‌లోనూ వేలకోట్ల బెట్టింగ్‌ జరిగిందని ఇందులో బాలీవుడ్‌ ప్రముఖులు ఉన్నారని సోనూ చెప్పాడు.

ఈ సీజన్‌లో బాలీవుడ్‌ నటుడు, సల్మాన్‌ ఖాన్‌ సోదరుడైన అర్బాజ్‌ ఖాన్‌ రూ.2.8 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అర్బాజ్‌ శనివారం విచారణకు రావాలంటూ థానే పోలీస్‌ బలవంతపు వసూళ్ల నిరోధక బృందం (ఏఈసీ) నోటీసులు పంపింది. అర్బాజ్‌ను బెట్టింగ్‌పై విచారించి అతని ఖాతాలు, లావాదేవీలను పరిశీలించనున్నారు. ‘బుకీల ద్వారానే అర్బాజ్‌ పెద్దమొత్తంలో డబ్బును బెట్టింగ్‌లో పెట్టారని తెలిసింది. అర్బాజ్‌ వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం’ అని ఈ కేసును విచారిస్తున్న ఏఈసీ సెల్‌ ఇన్స్‌పెక్టర్‌ ప్రదీప్‌ శర్మ వెల్లడించారు. కాగా, బెట్టింగ్, పోలీసుల నోటీసులపై తనకు తెలియదని అర్బాజ్‌ తండ్రి సలీమ్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

విచారణలో విస్తుపోయే అంశాలు
ఓ ప్రైవేటు వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసుల విచారణ సందర్భంగా సోనూ తెలిపిన వివరాలు విస్తుపోయేలా ఉన్నాయి. అర్బాజ్‌ బెట్టింగ్‌కు పాల్పడ్డట్లు ఆధారాలతోపాటు.. అతని లావాదేవీల వివరాలనూ ఏఈసీ పోలీసులు సంపాదించారు. సల్మాన్‌ సోదరుడు దాదాపు రూ. 2.8కోట్లు కేవలం ఈ ఏడాది ఐపీఎల్‌ బెట్టింగ్‌లో నష్టపోయినట్లు తెలిసింది. అయితే.. ఈ రూ. 2.8 కోట్లను అర్బాజ్‌ ఇంకా చెల్లించలేదని తెలిసింది.

ఈ మొత్తాన్ని చెల్లించాలని అడుగుతున్నా అర్బాజ్‌ స్పందించడం లేదని.. దీంతో ఇరువురి మధ్య గొడవ జరుగుతోందని సోనూ పోలీసులకు తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో పేరును బయటకు చెబుతానని అర్బాజ్‌ను బెదిరించినట్లు కూడా సోనూ ఒప్పుకున్నారు. గతంలో 2 మ్యాచుల్లో అర్బాజ్‌ బెట్టింగ్‌ పెట్టాడని వెల్లడించాడు. ముంబై బుకీలకు దావూద్‌ గ్యాంగ్‌తో సంబంధాలపైనా సోనూ కీలక సమాచారమిచ్చాడు. గతంలో ఐపీఎల్‌ కేసులో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్‌కు పాల్పడ్డారు.

బెట్టింగ్‌ కింగ్‌ సోనూ!
ముంబై సట్టా బజార్, గ్యాంబ్లింగ్‌ సర్కిల్స్‌లో సోనూ పేరు తెలియని వారుండరు. ఇతనికి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా,దక్షిణాఫ్రికా ఇతర దేశాల్లోనూ క్లయింట్లు ఉన్నారు. ‘బెట్‌ అండ్‌ టేక్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి దీని ద్వారా ఐపీఎల్‌తోపాటు భారత్‌లో, విదేశాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్‌ను నడిపిస్తున్నాడు. 2016లో శ్రీలంక–ఆస్ట్రేలియా మధ్య శ్రీలంకలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌ను సోనూ ఫిక్స్‌ (క్యురేటర్‌ సాయంతో) చేసినట్లు ఆధారాలు దొరికాయి. అర్బాజ్‌తో తన సాన్నిహిత్యాన్ని తెలుపుతూ పలు చిత్రాలను సోనూ పోలీసులకిచ్చాడు. సోనూ వద్ద స్వాధీనం చేసుకున్న డైరీలో బాలీవుడ్‌ సెలబ్రిటీలతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్లు, బిల్డర్లు, షేర్‌మార్కెట్‌ పెట్టుబడిదారులు, 100 మంది బుకీల వివరాలున్నట్లు తెలిసింది.

ఇప్పటి వరకు సోనూ సహా ఆరుగురు బుకీలను అరెస్టు చేశారు. థానే జిల్లా డోంబివలీలోని ఓ హోటల్‌ నుంచి మే 15న మరో ముగ్గురిని బెట్టింగ్‌ కేసులో ఏఈసీ బృందం అరెస్టు చేసింది. వీరిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో వీరికి సాయం చేసేందుకు వచ్చిన సోనూను పోలీసులు వలపన్ని అరెస్టు చేయటం, విచారణ జరపడంతో తాజా ఐపీఎల్‌ బెట్టింగ్‌పై కొత్త అంశాలు బయటికొచ్చాయి. సోనూ∙నుంచి సేకరించిన సమాచారంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఒకరున్నట్లు తెలుస్తున్నప్పటికీ అది ఎవరనే విషయం బయటకు తెలియడంలేదు. సోనూ టర్నోవర్‌ ఏడాదికి రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు