ఆ హోటల్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే..!

8 Jul, 2020 08:52 IST|Sakshi

చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న వికాస్‌ దూబే!

చండీగఢ్‌: ఎన్నో అకృత్యాలకు పాల్పడి, పోలీసుల ప్రాణాలు బలిగొన్న ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గల ఓ హోటల్‌లో అతడు ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న వికాస్‌ దూబే సదరు హోటల్‌ నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో హోటల్‌ నుంచి సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి కోసం మళ్లీ గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని ఫరీదాబాద్‌, గురుగ్రాం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పోలీసులు, ప్రజలను అప్రమత్తం చేశారు. గ్యాంగ్‌స్టర్‌ దేశ రాజధానిలో లొంగిపోనున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా వికాస్‌ దూబేను పట్టిస్తే రూ. 2.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.(ఒక్క ఫోన్‌ కాల్‌... అంతా తలకిందులైంది!)

ఇదిలా ఉండగా.. కాల్పులకు తెగబడి ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు బలిగొన్న వికాస్‌ దూబేకు రాజకీయ నాయకులతో పాటు పోలీసులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయగా.. దాదాపు 200 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా విచారణకు హాజరుకానున్నారు. కాగా ప్రస్తుతం వికాస్‌ దూబే అనుచరుడు దయా శంకర్‌ అగ్నిహోత్రితో పాటు దూబే కోడలు చామా, వారి పనిమనిషి రేఖా అగ్నిహోత్రితో పాటు సురేశ్‌ వర్మ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దూబేను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై అతడి గ్యాంగ్‌ కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే.(‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’)

మరిన్ని వార్తలు