ప్రే‘మైకం’!

15 Feb, 2020 11:32 IST|Sakshi
విహార ప్రాంతాల్లో ప్రేమికుల పాట్లు

ఎక్కడచూసినా ప్రేమజంటలే

సందట్లో పోలీసుల సడేమియా

కొడెక్కానాల్‌ పార్టీపై కోర్టు నిషేధం

‘రెండక్షరాల ప్రేమ.. రెండు క్షణాల ప్రేమ’ అన్నాడో సినీకవి. ఎందరో ప్రేమికులుఈ పాటలోని మాటలను నిజం చేస్తూ ‘ప్రేమ ఎంత మధురం..ప్రియురాలుఅంత కఠినం’ అంటూ విరహ గీతాలు పాడుకుంటున్నారు. అయితే కొందరు యువతీ యువకులు మాత్రం ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’ ప్రేమగీతాన్ని ఆలపిస్తూ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇలా చేదు, తీపి అనుభవాల ప్రేమజంటలు శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సందడి చేశాయి.  

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమికుల కోసం పోరాడిన క్రైస్తవమత బోధకులు వాలెంటైన్‌కు స్మారకంగా ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 14వ తేదీని ‘వాటెంటైన్‌ డే’గా జరుపుకుంటున్నారు. తల్లిపై ప్రేమ, తండ్రి, సోదరుడు, సోదరి, స్నేహితుడు, సహ విద్యార్థి ఇలా ప్రేమలో భిన్నమైన రకాలున్నా వాలెంటైన్‌ డే నాడు ఇలాంటి ప్రేమాభిమానులకు ఎంతమాత్రం తావులేకుండా పోయింది. పరస్పర ఆకర్షణతో కూడిన ప్రేమ జంటలకే వాలెంటైన్‌ డే పరిమితమైంది. ప్రేమను పెంచి పోషించేందుకు యువతీయువకులు ప్రతినిత్యం ఏదో ఒకచోట కలుసుకుంటున్నా ప్రేమికుల దినోత్సవం రోజున ఒకచోట చేరితే ఆ మజానే వేరు అన్నట్లు వ్యవహరిస్తారు.  
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పర్యాటక, విహార ప్రాంతాలు ప్రేమజంటలతో కళకళలాడాయి. మోటార్‌ సైకిళ్లు, కార్లు బారులుతీరాయి. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురానికి ఉదయం 8 గంటల నుంచి పెద్ద సంఖ్యలో ప్రేమజంటలు చేరుకోవడం ప్రారంభమైంది. మహాబలిపురం, చెన్నై మెరీనాబీచ్, బిసెంట్‌నగర్‌ బీచ్, ప్రధానమైన పార్కులు ప్రేమజంటలకు నిలయాలుగా మారాయి. బీచ్‌లలో ఎండను సైతం లెక్కచేయకుండా ఇసుకపై గంటలతరబడి కూర్చుని కాలక్షేపం చేశారు. పుష్పాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. 

జేబులు నింపుకున్న పోలీస్‌  
వివిధ వాహనాల్లో ఉత్సాహంగా వెళుతున్న ప్రేమజంటలను తనిఖీల పేరుతో బెదిరించి కొందరు పోలీసులు జేబులు నింపుకున్నారు. ఈసీఆర్‌లో వెళ్లే ప్రేమజంటలను అపి వాహన పత్రాల తనిఖీ, హెల్మెట్‌ వంటి వాటిని సాకుగా పెట్టుకుని జరిమానాలు విధించారు. కొద్దిపాటు డబ్బును తెచ్చుకున్న ప్రేమజంటలు సమీపంలోని దుకాణాల్లో తమ విలువైన వస్తువులను కుదువబెట్టి పోలీసులకు చెల్లించారు. 

కొడైక్కెనాల్‌ పార్టీపై నిషేధం  
కొడైక్కెనాల్‌లో గత వారం ఒక ప్రయివేటు తోటలో 276 మంది యువతీ యువకులు మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో ఊగిపోయారు. వీరిలో ఆరుగురు యువతులు కూడా ఉన్నారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి భవిష్యత్తు నాశనం అవుతుందనే సానుభూతితో హెచ్చరించి విడిచిపెట్టారు. పార్టీకి సారధ్యం వహించిన ముగ్గురిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. పూంపారై సమీపంలోని ఒక ప్రయివేటు లగ్జరీ అతిథి గృహంలో పాశ్చాత్య సంగీతం, విందు వినోదాలకు కొందరు బుక్‌ చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 13 నుంచి 16వ తేదీ వరకు పార్టీలు చేసుకునేందుకు కొందరు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఒక్కోరికీ రూ.2500 చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా రిజిష్ట్రరు చేసుకోవాలని నిర్వాహకులు ప్రకటించి తమిళనాడుతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులను సమీకరించారు. ఇటీవల జరిగిన అనుభవంతో సదరు పార్టీపై స్టే విధించాలని పోలీసులు మధురై హై కోర్టులో పిటిషన్‌ వేయగా మంజూరైంది. ఈ సంగతి తెలియక యువతీ యువకులు గురువారం రాత్రి నుంచీ కొడైక్కెనాల్‌ అతిథిగృహం వద్దకు చేరుకోవడం, పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి గుడారాలు వేసుకుని సేదతీరడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకుని పార్టీపై కోర్టు నిషేధం విధించిన సంగతిని చెప్పి వెళ్లిపోవాలని కోరారు. కొందరు యువతీ యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాదకద్రవ్యాలతో పార్టీ సాగుతుందనే అనుమానంతోనే స్టే తీసుకొచ్చినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. 

మరిన్ని వార్తలు