జేఎన్‌యూ విద్యార్ధులపై లాఠీచార్జ్‌

9 Dec, 2019 16:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఫీజుల పెంపుపై జేఎన్‌యూ విద్యార్ధుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్రపతి భవన్‌కు విద్యార్ధులు చేపట్టిన ప్రదర్శనలో ఘర్షణ చెలరేగగా పోలీసులు వారిని చెదరగొట్టారు. తమ సమస్యలను రాష్ట్రపతికి నివేదించేందుకు పెద్ద సంఖ్యలో ప్రదర్శనగా వెళుతున్న విద్యార్ధులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కాగా, ఆందోళనకారులు భికాజి కమాప్లేస్‌ మెట్రో స్టేషన్‌ వద్ద బారికేడ్లను తోసుకుంటూ ముందుకు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా వారిపై లాఠీచార్జి చేశామని పోలీసులు తెలిపారు.

హాస్టల్‌ చార్జీల పెంపును పూర్తిగా ఉపసంహరించేందుకు వర్సిటీ అధికారులు నిరాకరించడంతో విద్యార్ధులు రాష్ట్రపతి భవన్‌ వరకూ నిరసన ప్రదర్శనకు పూనుకున్నారు. శాంతియుతంగా రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శనగా వెళుతున్న తమపై ఖాకీలు జులుం ప్రదర్శించారని, లాఠీచార్జ్‌తో విరుచుకుపడ్డారని విద్యార్ధులు ఆరోపించారు. హాస్టల్‌ ఫీజుల పెంపుపై గత కొన్ని రోజులుగా విద్యార్ధుల ఆందోళనతో జేఎన్‌యూ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు