అయోధ్యపై అభ్యంతరకర పోస్టులు : 37 మందిపై కేసు

10 Nov, 2019 15:33 IST|Sakshi

లక్నో : అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన 37 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య తీర్పుపై అభ్యంతరకరంగా ఉన్న 3,712 సోషల్‌ మీడియా పోస్టులను  తామిప్పటికే తొలగించామని, మరికొన్ని ప్రొఫైల్స్‌ను డిలీట్‌ చేశామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు అయోధ్య సహా యూపీలోని అన్ని ప్రాంతాల్లో తీర్పు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్ధలకు సోమవారం వరకూ సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ రాజధానిలో హైటెక్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి శాంతి భద్రతల పరిస్ధితిని పర్యవేక్షించారు. అయోధ్య కేసులో తీర్పు వెలువడిన క్రమంలో మీడియా, సోషల్‌ మీడియా ఇతర మార్గాల్లో వెల్లడయ్యే సమాచారానికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు తొలిసారిగా ఎమర్జన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు