హెలికాప్టర్‌ నుంచి పూల వర్షం.. వివాదం

9 Aug, 2018 16:02 IST|Sakshi

లక్నో : కన్వార్‌ యాత్ర చేస్తున్న శివభక్తులపై యూపీ పోలీసు ఉన్నతాధికారులు పూల వర్షం కురిపించడంపై పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మీరట్‌ జోన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌(ఏడీజీ) ప్రశాంత్‌ కుమార్‌, మీరట్‌ కమీషనర్‌ అనిత మెశ్రమ్‌లతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు శివభక్తులకు స్వాగతం పలుకుతూ హెలికాఫ్టర్‌ నుంచి పూలు చల్లారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డ్యూటీలో ఉన్న పోలీసులు ఇలా ఎలా వ్యవహరిస్తారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక వర్గానికి అనుకూలంగా పోలీసుల ప్రవర్తన ఉందంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఘటన వివాదస్పదంగా మారడంతో ఏడీజీ ప్రశాంత్‌ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దీనిలో ఎటువంటి మతపరమైన కోణం లేదని వివరణ ఇచ్చారు. కన్వార్‌ యాత్ర చేపట్టిన శివ భక్తులకు స్వాగతం పలకడానికే పూలు చల్లినట్టు తెలిపారు. తమ వ్యవస్థ ప్రతి వర్గాన్ని గౌరవిస్తుందని పేర్కొన్నారు. అలాగే రంజాన్‌, బక్రీద్‌, జైన్‌ పండుగల్లో తాము పాలుపంచుకుంటామని అన్నారు.

పోలీసు వాహనంపై భక్తుల దాడి
కన్వార్‌ యాత్ర చేపట్టిన కొందరు శివభక్తులు ఇటీవల ఢిల్లీలోని మోతీ నగర్‌ ప్రాంతంలో ఓ కారుపై దాడి చేశారు. వారు దాడి చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇందుకు సంబంధించి విమర్శలు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన మరువక ముందే మరి కొందరు శివభక్తులు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఏకంగా పోలీసు వాహనంపై దాడి చేశారు. కర్రలతో ఆ వాహనం అద్దాలను పగులకొట్టారు. పోలీసులు వారించినప్పటికీ లాభం లేకపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు తమ వాహనాన్ని వెనక్కి తిప్పుకొని అక్కడి నుంచి బయటపడ్డారు. అయినా కొందరు పోలీసు వాహనం వెంట పరుగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ యాత్రకు సంబంధించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

కన్వార్‌ యాత్ర :
శివభక్తులు ప్రతి ఏడాది శ్రావణమాసంలో కన్వార్‌ యాత్ర చేపడతారు. ఈ యాత్రలో భాగంగా శివ భక్తులు హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి లాంటి పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి సేకరించిన గంగా జలాలను తమతో పాటు తీసుకెళ్తారు. ఆ పవిత్ర జలంతో తమ ప్రాంతంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా