అన్నార్థుల ఆక‌లి తీర్చుతున్న పోలీసులు

19 May, 2020 18:03 IST|Sakshi

వ‌డోదర: రూల్స్ బ్రేక్ చేస్తే లాఠీ ఎత్త‌డ‌మే కాదు, ఆక‌లి అని పిలిస్తే అన్నం పెట్టేందుకు రెడీ అంటున్నారు పోలీసులు. ఇందుకోసం పోలీస్ స్టేష‌న్‌ను వంట‌శాల‌గా మార్చేసిన‌ అద్భుత దృశ్యం గుజ‌రాత్‌లోని వ‌డోదర‌లో చోటు చేసుకుంది. లాక్‌డౌన్ వ‌ల్ల‌ వ‌ల‌స కూలీల‌తోపాటు నిరుపేద‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. వారి ఘోస‌లు చూసిన పోలీసుల మ‌న‌సు చ‌లించిపోయింది.  కానీ నిస్స‌హాయులుగా మిగిలిపోయారు. మ‌రోవైపు ఓ వ్య‌క్తి, ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు క్యాన్స‌ర్ కార‌ణంగా మ‌ర‌ణించింది. దీంతో అత‌ను ఎంత‌గానో కుమిలిపోయాడు. త‌న గారాల ప‌ట్టి జ్ఞాప‌కార్థంగా ఏదైనా చేయాల‌నుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా అన్న‌దానానికి సిద్ధ‌మ‌య్యాడు. (ప్రతాప్‌.. మళ్లీ పోలీస్‌)

ఇందుకోసం వ‌డోద‌రా పోలీసుల‌ను క‌లిసి త‌న ఆలోచ‌న వివ‌రించాడు. అప్ప‌టికే క‌ళ్ల ముందు కనిపిస్తున్న హృద‌య విదార‌క దృశ్యాలు చూసి చ‌లించిపోయిన పోలీసులు అత‌ని ఆలోచనను ఆచరించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందుకోసం డీసీపీ స‌రోజ్ కుమారి ఎనిమిది మంది సభ్యుల‌తో ఓ ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా త‌మ డ్యూటీలు పూర్తైన త‌ర్వాత కిచెన్‌లో చెమ‌టోడ్చుతారు. స్వ‌హ‌స్తాలతో వంట చేసి నిరుపేద‌ల‌కు భోజ‌నం పెడ‌తారు. ఈ విష‌యం తెలిసిన చాలామంది పుట్టిన రోజులు, పెళ్లి రోజులకు పెట్టే ఖ‌ర్చును డ‌బ్బు లేదా స‌రుకు రూపేణా‌ పోలీస్ స్టేష‌న్‌కు విరాళంగా ఇస్తున్నారు. వీటి స‌హాయంతో పోలీసులు వంట చేసి ప్ర‌తి రోజు 600 మందికి క‌డుపు నింపుతూ శ‌భాష్ అనిపించుకుంటున్నారు. (అనాథ ఆకలి తీర్చిన పోలీస్‌)

మరిన్ని వార్తలు