సిద్ధార్థ మరణంపై దర్యాప్తు వేగిరం, పోలీస్‌ కమిషనర్‌ బదిలీ 

2 Aug, 2019 12:14 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కాఫీ డే కింగ్‌ వీజీ సిద్ధార్థ మరణంపై దర్యాప్తు చేసేందుకు పోలీసు బృందం రంగంలోకి దిగింది. మిస్టరీగా మారిన సిద్ధార్థ మృతిపై దర్యాప్తును కోదండరాం నేతృత్వంలోని దర్యాప్తు బృందం  ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన అధికారులు తాజాగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్( సీఎఫ్ఓ)తో పాటు మరికొంతమందిని విచారించినున్నారు.  జపాన్‌లోని టోక్యోలో ఉన్న సీఎఫ్ఓ, ఇతర అధికారులకు పోలీసులు ఇప్పటికే ఈ మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది.  ఈ కేసులో కీలక మైన పోస్ట్‌మార్టం నివేదిక ఈ రోజు  వెల్లడయ్యే అవకాశం ఉంది.

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణంపై దర్యాప్తునకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళూరు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ గురువారం వెల్లడించారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (మంగళూరు సౌత్ సబ్ డివిజన్) టీ కోదండరాం ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. అలాగే మరణం ఎలా జరిగిందో స్పష్టం చేసే కీలకమైన పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇప్పటికే  బృందం సంస్థ ఎగ్జిక్యూటివ్‌లను, ఉద్యోగులను ప్రశ్నించి చాలా సమాచారం సేకరించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంత మందిని కూడా ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. సిద్ధార్థకు చెందిన రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామనీ, వీటిని పోలీసులు విశ్లేషిస్తున్నారని పాటిల్ చెప్పారు.

ఇది ఇలా ఉంటే  పోలీస్‌ కమీషనర్‌ (క్రైమ్‌)సందీప్‌ పాటిల్‌ను బెంగళూరుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం  ఆదేశాలు జారి చేసింది. ఈయన స్థానంలో మైసూరు ఇంటిలిజెన్స్‌ డిఐజీగా ఉన్న   డా. సుబ్రహ్మణ్యేశ్వర రావును కొత్త పోలీసు కమిషనర్‌గా నియమించింది. అలాగే మంగళూరు నగర డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) హనుమంతరాయను  కూడా దావణగెరే పోలీసు సూపరింటెండెంట్‌గా బదిలీ చేసింది. 2004 బ్యాచ్‌కు చెందిన సందీప్‌ పాటిల్‌ను పాటిల్ ఫిబ్రవరి 21న  మంగళూరు కమిషనర్‌గా నియమించింది. ఐదు నెలలు ఇక్కడ పనిచేసిన పాటిల్ ను బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) గా తాజాగా  రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.  2002 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సుబ్రహ్మణ‍్యేశ్వరావు బెంగళూరులోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఐదేళ్లపాటు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశారు.

కాగా సిద్ధార్ధ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో అన్నికోణాల్లో సమగ్ర దర్యాప్తు సాగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఐటీ అధికారుల వేధింపులతో విసిగిపోయాననీ, తన తప్పులకు తానే బాధ్యుడనని, క్షమించాలని పేర్కొంటూ లేఖరాసి సిద్ధార్ధ  కనిపించకుండా పోవడం, 36 గంటల తరువాత  నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభించడం  తదితర పరిణామాలు తెలిసినవే.

మరిన్ని వార్తలు