వీరప్పన్ ను ఇలా చంపారట!

4 Feb, 2017 01:28 IST|Sakshi
వీరప్పన్ ను ఇలా చంపారట!

► హత్యకు ప్రముఖ పారిశ్రామికవేత్త సహకారం
► వీరప్పన్  శిబిరంలోకి మారువేషంలో ఎస్‌ఐ
► కంటి చికిత్సకని తీసుకొచ్చి కాల్పులు
►  ఐపీఎస్‌ పుస్తకంలోని సమాచారం లీక్‌!  

సాక్షి ప్రతినిధి, చెన్నై: మూడు (కన్నడ, తమిళ, కేరళ) రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఎర్రచందనం స్మగ్లర్‌ వీరప్పన్  అంత ఈజీగా పోలీసులకు ఎలా దొరికాడబ్బా అనే సందేహం 13 ఏళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయింది. అతడిని మట్టుపెట్టిననాటి తన అనుభవాలపై మాజీ ఐపీఎస్‌ అధికారి విజయకుమార్‌ ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. ఈ పుస్తకం త్వరలో మార్కెట్‌లో విడుదల కావాల్సి ఉండగా అందులోని కొంత సమాచారం బహిర్గతమైంది. అతడిని చంపడంలో చెన్నైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రముఖ పాత్ర పోషించినట్లు వెల్లడైంది. వీరప్పన్ కోసం విజయకుమార్‌ సాగించిన వేట, పన్నిన వ్యూహం వివరాలివి.

పారిశ్రామికవేత్తతో దోస్తీ: చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకు వీరప్పన్ తో ఎంతోకాలంగా సన్నిహిత పరిచయముంది. దీంతో ఆ పారిశ్రామిక వేత్తపై పోలీసులు నిఘాపెట్టారు. వీరప్పన్  వర్గంలోని రహస్య గూఢచారి ఒకరు పారిశ్రామికవేత్తను కలుసుకునేందుకు ఒక హోటల్‌కు వచ్చాడు. ఆ గూఢచారి వెళ్లిపోగానే కమెండో దళాలు పారిశ్రామికవేత్తను చుట్టుముట్టాయి. తనకు అదనంగా మారణాయుధాలు అవసరమని, చూపు మందగించినందున కంటి ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా వీరప్పన్ కోరినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో వీరప్పన్ ను పట్టుకునేందుకు పథకం పన్నారు.  చెన్నైలో పేరుమోసిన రౌడీ ఆయోధ్యకుప్పం వీరమణిని ఎన్ కౌంటర్‌ చేసిన ఎస్‌ఐ వెల్లదురైని.. వీరప్పన్  వద్దకు మారువేషంలో పంపాలని విజయకుమార్‌ నిర్ణయించారు.

పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. ఆ గూఢచారి ధర్మపురికి చేరుకుని ఒక టీ దుకాణంలో పారిశ్రామికవేత్తను కలిశాడు. తాను ఒక మనిషిని పంపుతానని.. అతనితోపాటుగా వస్తే మదురై లేదా తిరుచ్చిలో వీరప్పన్ కు కంటి ఆపరేషన్  చేయిస్తానని గూఢచారికి చెప్పాడు. దీంతో వీరప్పన్ మనిషి ఒక లాటరీ చీటీని కొని దాన్ని సగం చించి ఒక ముక్కను తన వద్ద ఉంచుకుని రెండో ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్కను తెచ్చే వ్యక్తితోనే వీరప్పన్  వస్తారన్నాడు

లాటరీ ముక్కను నమ్మి..: విజయకుమార్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ వెల్లదురై ఆ రెండో ముక్కను తీసుకుని అడవుల్లో వీరప్పన్ ను కలుసుకున్నాడు. తనవద్దనున్న తొలిసగంతో సరిపోల్చు కున్నాక ఎస్సైని వీరప్పన్  నమ్మకస్తుడిగా భావించాడు. వెల్లదురై చెప్పినట్లుగానే వైద్యం చేయించుకునేందుకు బయలుదేరాడు. పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి వీరప్పన్ ను అతని సహచరులను ఎస్‌ఐ వెల్లదురై ఎక్కించాడు. ధర్మపురి వద్ద సిద్ధంగా ఉన్న కమెండో పోలీసులు వీరప్పన్ పై కాల్పులు జరిపి హత మార్చారు. వీరప్పన్ ను హతమార్చేందుకు సహకరించడంతో సదరు పారిశ్రామికవేత్తపై కేసులు పెట్టలేదు. ఆ  వ్యాపారి ఎవరనేది కుమార్‌ బైటపెట్టలేదు.

మరిన్ని వార్తలు