ఏఎస్‌ఐ చేయి నరికేశారు!

13 Apr, 2020 03:44 IST|Sakshi
సంఘటనా స్థలిలో దాడి చేస్తున్న వ్యక్తి, నేలపై పడిపోయిన ఏఎస్‌ఐ హర్జీత్‌ సింగ్‌

లాక్‌డౌన్‌ పాస్‌ అడిగినందుకు..

పంజాబ్‌లో పోలీసులపై దుండగుల దాడి

ముగ్గురు పోలీసులు సహా మరో నలుగురికి గాయాలు

గురుద్వారా వద్ద ఎదురుకాల్పులు.. 11 మంది అరెస్ట్‌

ఏఎస్‌ఐ చేతిని తిరిగి సర్జరీ ద్వారా అతికించిన వైద్యులు

చండీగఢ్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ముఠా ఇదేమని ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి చేయి తెగిపోగా మరో ముగ్గురు పోలీసులు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రం పటియాలా జిల్లా సనౌర్‌ పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్‌ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి కొందరు నిహంగ్‌(సిక్కుల్లోని ఓ వర్గం)లు ఎస్‌యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు.

పోలీసులు వారిని పాస్‌లు చూపించాలని కోరగా బారికేడ్లపైకి వాహనాన్ని నడిపారు. అడ్డుకున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై) హర్జీత్‌ సింగ్‌ చేతిని తమ వద్ద ఉన్న కత్తితో నరికారు. మార్కెట్‌ అధికారితోపాటు మరో ముగ్గురు పోలీసులను కూడా గాయపర్చారు. పోలీసులు వెంబడించగా దుండగులు అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలోని బల్బేర్‌ గ్రామంలోని గురుద్వారాలో దాక్కున్నారు. ఈలోగా గాయపడిన హర్జీత్‌ సింగ్‌ను, తెగిన  చేయి సహా అధికారులు చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)కు తరలించారు.

నిహంగ్‌ల ముఠా గురుద్వారాలో దాగిన విషయం తెలిసిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ ప్రదేశాన్ని దిగ్బంధించారు. లోపలున్న మహిళలు, చిన్నారులకు హాని కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. లొంగిపోవాలని హెచ్చరించినా దుండగులు వినకుండా గ్యాస్‌ సిలిండర్లతో గురుద్వారాను పేల్చి వేస్తామని బెదిరించడంతోపాటు పోలీసులపైకి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకా>ల్పుల్లో ఆ ముఠాలోని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.

అనంతరం దాడికి పాల్పడిన ముఠాలోని ఐదుగురు, ఓ మహిళ సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు పిస్టళ్లు, కత్తులు, మత్తు కోసం వాడే గసగసాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పీజీఐఎంఈఆర్‌లోని వైద్య బృందం ఏఎస్సై హర్జీత్‌ సింగ్‌ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.


హర్జీత్‌ సింగ్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

మరిన్ని వార్తలు