రాజకీయ ఘర్షణ.. జర్నలిస్ట్‌ హత్య!

21 Sep, 2017 08:16 IST|Sakshi
రాజకీయ ఘర్షణ.. జర్నలిస్ట్‌ హత్య!
సాక్షి, అగర్తలా: రెండు రాజకీయ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ పాత్రికేయుడిని దారుణంగా హత్య చేసిన ఘటన త్రిపురలో కలకలం రేపుతోంది. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పలువురు జర్నలిస్ట్‌లు ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ధర్నాకి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
పశ్చిమ త్రిపురలోని మండ్వాయి ప్రాంతంలో బుధవారం ఐపీఎఫ్‌టీ మరియు సీపీఐ(ఎం) పార్టీ గిరిజన విభాగం త్రిపుర ఉపజాతి ఘన్‌ ముక్తి పరిషత్‌ ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీనిని కవరేజీ చేయటానికి వెళ్లిన సంతను భౌమిక్‌(28) అనే పాత్రికేయుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అంతేకాదు గొడవలో 118 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతారణం నెలకొంది. 
 
ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తప్పవని త్రిపుర మంత్రి భాను లాల్‌ సాహా తెలిపారు. ఘటన చోటుచేసుకున్న చుట్టుపక్కల  రెండు జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. హత్య వెనుక ఐపీఎఫ్‌టీ నేతల హస్తం ఉందని పలువురు ఆరోపిస్తుండగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వార్తలు