వాయు కాలుష్యంపై ఎన్నికల ప్రణాళికలు

27 Apr, 2019 15:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 20 వాయు కాలుష్య నగరాల్లో 14 కాలుష్య నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. అవి వరుసగా ఢిల్లీ, ఆగ్రా, ముజఫర్‌పూర్, జైపూర్, పాటియాల, వారణాసి, కాన్పూర్, ఫరిదాబాద్, గయా, జైపూర్, శ్రీనగర్, పట్నా, లక్నో, గుర్‌గావ్‌ నగరాలు. కాలుష్యం కారణంగా భారత్‌లో ఒక్క 2017 సంవత్సరంలోనే 10.24 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. వివిధ రకాలుగా సంభవిస్తున్న అకాల మరణాల్లో వాయు కాలుష్యం ఏడవ స్థానంలో ఉంది.

ఈ కారణంగా మొట్టమొదటి సారిగా బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ లాంటి జాతీయ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో ఈ అంశం చోటు చేసుకుంది. ప్రస్తుతం దేశంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ)’ను మిషన్‌లాగా వ్యవస్థీకతం చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. రానున్న ఐదేళ్ల కాలంలో దేశంలో కాలుష్యాన్ని 35 శాతం తగ్గిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. వాస్తవానికి 2024 సంవత్సరం నాటికల్లా వాయు కాలుష్యాన్ని 20-30 శాతం వరకు తగ్గించడం ఎన్‌సీఏపీ లక్ష్యం. 2022 సంవత్సరం నాటికల్లా దేశంలో పంట దుబ్బులను తగులబెట్టడాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని బీజేపీ పేర్కొంది.

ఇక వాయు కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ప్రస్తుతమున్న ఎన్‌సీఏపీని మరింత బలోపేతం చేస్తామని కూడా పేర్కొంది. దేశంలో వాయు కాలుష్యానికి ప్రమాణాలను నిర్దేశించి నియంత్రించేదుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది. ఎక్కువ వాయు కాలుష్యానికి కారణమవుతున్నవి ఏమిటో గుర్తించి, వాటిని నియంత్రిస్తామని కూడా తెలిపింది. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఇంత శాతం కాలుష్యాన్ని తగ్గిస్తామంటూ ఒక టార్గెట్‌ను మాత్రం ఖరారు చేయలేదు. దేశంలో వాయు కాలుష్య నివారణకు కృషి చేస్తామని వామపక్షాలు కూడా తమ ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్నాయి. అయితే పెద్దగా వాటి గురించి వివరించలేదు. వాయు కాలుష్య నివారణకు రాజకీయ పార్టీలు ఈమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం కూడా విశేషమని, రానున్న అసెంబ్లీ, నగర పాలక ఎన్నికల్లో దీనికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆశిస్తున్నట్లు ‘కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌’కు చెందిన డొలాకియా అభిప్రాయపడ్డారు.

14 మంది ఎంపీల మౌనం
ప్రపంచవ్యాప్తంగా 20 అత్యధిక కాలుష్య నగరాల్లో 14 నగరాలు భారత్‌లోనే ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నప్పటికీ గతే కొన్నేళ్లుగా ఈ నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్‌ సభ్యులు కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎంపీలంతా ఈ విషయంలో మౌనం పాటిస్తూ వచ్చారని ఢిల్లీలోని క్లైమెట్‌ ట్రెండ్స్‌ సంస్థ ‘పొలిటికల్‌ లీడర్స్‌ పొజిషన్‌ అండ్‌ యాక్షన్‌ ఆన్‌ ఏర్‌ క్వాలిటీ ఇన్‌ ఇండియా’ శీర్షికతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వారణాసిలో సుందరీకరణ, రోడ్ల లాంటి సౌకర్యాలకు మోదీ, ఎంపీగా ప్రాధాన్యత ఇచ్చారని ఆ నివేదిక పేర్కొంది. వారణాసిలో గంగా ప్రక్షాళనకు ఆయన ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినా అది కూడా అంతంత మాత్రంగానే నడుస్తోందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు