'జీరో వేస్ట్' వెగాన్ వెడ్డింగ్..!

2 Dec, 2015 17:33 IST|Sakshi
'జీరో వేస్ట్' వెగాన్ వెడ్డింగ్..!

బెంగళూరు లో ఇటీవల ఓ వెడ్డింగ్ రిసెప్షన్.. విభిన్నంగా జరిగింది. నగరాన్ని కాలుష్య, వ్యర్థ రహితంగా చేయడమేకాక, పచ్చదనాన్ని ప్రచారం చేసేందుకు ఓ రాజకీయ నాయకుడి కుమార్తె నడుం బిగించింది. శాకాహార జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త అయిన సౌమ్య.. తన వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని గ్రీన్ లివింగ్ ప్రచారానికి వేదికగా మలచుకుంది.  కర్నాటక రవాణా మంత్రి ఆర్ రామలింగారెడ్డి కుమార్తె అయిన సౌమ్యారెడ్డి.. ముందుగా జీరో వేస్ట్ వెగాన్ వెడ్డింగ్ కార్యక్రమానికి తన పెళ్ళితోనే శ్రీకారం చుట్టింది.

తాను చేసే ప్రతి పనీ పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనుకున్న సౌమ్య... బెంగళూరుకు చెందిన సామాజిక సంస్థ హసిరు దళ సహాయం తీసుకుంది. సంస్థలో  శిక్షణ పొందిన 150 మంది వేస్ట్ పికర్స్  ను రిసెప్షన్ సమయంలో అక్కడ పేరుకునే వ్యర్థ పదార్థాల విభజనకు ముందుగానే ఏర్పాటు చేసింది. ఇలా సేకరించిన వాటిలో ఆహార వ్యర్థాలను మాగాడి రోడ్ లోని బయో మెథన్సేషన్ ప్లాంట్ కు, పొడి వ్యర్థాలను ఇతర కలెక్షన్ సెంటర్లకు తరలించే ఏర్పాట్లు చేశారు. ''ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడంతోపాటు..  కనీసం ఒక్క పూవును కూడ వేస్ట్ చేయకుండా ఉండటమే ధ్యేయంగా మా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం'' అంటున్నారు 'హసరు దళ' సహ వ్యవస్థాపకుడు మార్వాన్ అబుబాకర్..

తవ వివాహంలో అలంకరణ మొదలు ప్రతి విషయంలోనూ ఎకో ఫ్రెండ్లీ పద్ధతిని పాటించిన సౌమ్య...  పెళ్ళికి వచ్చిన అతిథులకు సైతం శాకాహార భోజనాన్ని రూపకల్పన చేశారు. క్యాటరర్లు కూడ నెయ్యి, పెరుగు వంటి పదార్థాలకు బదులుగా కొబ్బరి రసం, సోయాబీన్ పాలు, పెరుగు వాడకంలోకి తెచ్చారు. ఒకవేళ వచ్చిన అతిథులకు కాఫీ, టీల వంటివి కావాలన్నా సోయాబీన్ మిల్క్ తోనే తయారు చేశారు. ప్లాస్టిక్ కప్పులకు బదులుగా స్టీల్, పింగాణీ ప్లేట్లను, కప్పులను వాడటమే కాక, అలంకరణకు కూడ పూలకు బదులుగా పేపర్లను వాడారు.

 

అంతేకాక వచ్చిన అతిథులకు గుర్తుండిపోయేట్టు రిటర్న్ గిఫ్ట్లను కూడా బెంగళూరు ప్రభుత్వ నర్సరీలనుంచి కొనుగోలు చేసిన గంధం, రోజ్ వుడ్, పనస, వేప వంటి మొక్కలను అందించారు.  ఆహ్వాన పత్రికలోనే ఎటువంటి బహుమతులు, బొకేలు తేవొద్దని విన్నవించారు. ఒకవేళ బొకేలను ఎవరైనా తెచ్చినా... ప్రవేశ ద్వారం వద్దే సేకరించారు. ఆహ్వాన పత్రికలు కూడ పునర్వినియోగానికి పనికి వచ్చే కాగితంతో తయారు చేశారు. ఎక్కువ శాతం ఈ మెయిల్ ద్వారా ఆహ్వానాలను పంపారు.

అలాగే వచ్చిన అతిథులు కూడా సిల్క్ వస్త్రాలను ధరించకుండా ఊలు, లెదర్, పట్టు వస్త్రాలను ధరించేలా ముందుగానే జాగ్రత్తలను తీసుకున్నారు. అతిథులకు బహుమతిగా ఇచ్చే దుస్తుల్లోనూ సిల్క్ లేకుండా చర్యలు తీసుకున్నారు. చివరికి వధువు, వరుడి మేకప్ విషయంలోనూ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులే వాడకంలోకి తెచ్చారు. వ్యర్థ పదార్థాల నిర్వహణలో పికర్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన హసిరు దళ గత రెండేళ్ళలో అనేక మారధాన్లు, వివాహల సందర్భంలో వేస్ట్ మేనేజ్ మెంట్ ను నిర్వహించింది.  గతేడాది సుమారు ఎనిమిది వివాహాలకు సంబంధించి సుమారు ఐదు టన్నుల వ్యర్థాలను సంస్థ సేకరించింది.

మరిన్ని వార్తలు