నాడు ప్రాణమిస్తే నేడు ప్రాణం తీస్తున్నాం!

21 Apr, 2017 16:45 IST|Sakshi
నాడు ప్రాణమిస్తే నేడు ప్రాణం తీస్తున్నాం!

దేశంలో నానాటికి పెరిగిపోతున్న గోరక్షకుల దౌర్జన్యాలపై పార్లమెంట్‌లో ప్రస్తావన రాగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ గోరక్షకులను సమర్థిస్తూ, గోరక్షణ భారత స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగమన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షం, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించాలన్నారు. ఆమెకు సరైన సమాధానం చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీ తడబడగా, స్వాతంత్య్ర పోరాటానికి, గోరక్షణకు సంబంధం లేదంటూ వామపక్షాలు మండిపడ్డాయి. ఇక పార్లమెంట్‌ వెలుపల తనకు తాను గోరక్షకులుగా చెప్పుకునే సాధ్వీ కమల్‌ మరో అడుగు ముందుకేసి రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఏప్రిల్‌ 1న పహ్లూ ఖాన్‌ను కొట్టి చంపిన గోరక్షకులను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న భగత్‌ సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, సుఖ్‌దేవ్‌లకు ఆధునిక అనుచరులని పొగిడారు. వారిని అన్ని విధాలా ఆధుకుంటామని, వారిని జైలు నుంచి విడుదల చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. వీరిద్దరి వ్యాఖ్యల తీవ్రతలో ఎంతో  వ్యత్యాసం ఉన్నా ఇద్దరూ స్వాతంత్య్ర పోరాటంతో గోరక్షణ ఉద్యమాన్ని ముడిపెట్టారు.

గోరక్షణకు, దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధం ఉందా? ఉంటే అది ఏ రకమైన సంబంధం? ఢిల్లీని బ్రిటిష్‌ పాలకులు కైవసం చేసుకోకుండా పోరాడాల్సిన భారతీయులైన హిందువులు, ముస్లింలు కలహాలకు దిగకుండా ఉండేందుకు 1857లోనే అప్పటి మొగల్‌ రాజు బహదూర్‌ షా జఫర్‌ నగరంలో గోవధను నిషేధించారు. అదే శతాబ్దంలో, అంటే 1875లో దయానంద సరస్వతి ఆర్యసమాజ్‌ను స్థాపించడం ద్వారా గోరక్షణను ఓ ఉద్యమంగా చేపట్టారు. ఈ ఉద్యమం పంజాబ్‌తో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలకు విస్తరించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న బాల గంగాధర్‌ తిలక్‌ కూడా గోరక్షణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న చాలామంది గోరక్షక సంఘాల్లో కూడా సభ్యులుగా కొనసాగారు. అనేక గోరక్షణ శాలల్లో కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్‌ ప్లీనరీ జరిగిన మైదానాల్లోనే కాంగ్రెస్‌ సమావేశాలు ముగిశాక గోరక్షకుల సమావేశాలు కొనసాగిన సందర్భాలూ ఉన్నాయి.

స్వాతంత్రోద్యమం నాటికి బీజేపీ లాంటి పార్టీలు పుట్టలేదు. ఆరెస్సెస్‌ లాంటి మాతృసంస్థలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. గోరక్షణ కోసం ఉద్యమాలు జరిపిన ఆర్యసమాజ్‌ సంస్థాపకులు దయానంద సరస్వతి  రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ దేశానికి స్వాతంత్య్రం కావాలని ఏనాడూ కోరలేదు. నాడు ప్రజల సమీకరణ కోసం కాంగ్రెస్‌ పార్టీయే గోరక్షణ గురించి ఎక్కువగా మాట్లాడింది. ముఖ్యంగా స్వతహాగా శాకాహారి అయిన మహాత్మాగాంధీ గోవధను వ్యతిరేకించారు. గోమాంసాన్ని స్వతహాగా త్యజించాలని ఇటు దళితులకు, అటు ముస్లింలకు పిలుపునిచ్చారు. నాడు స్వాతంత్య్ర పోరాటానికి అందరి ఐక్యత అవసరం కనుక ఆయన చట్టపరంగా గోవధను నిషేధించాలని కోరలేదు. అన్ని వేళల అహింసను కోరుకునే మహాత్మాగాంధీ గోవుల రక్షణ కోసం ప్రాణాలివ్వని వాడు హిందువే కాదన్నారు. ఇప్పుడు ప్రాణాలు తియ్యని వాడు హిందువే కాదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోరక్షణ పేరిట దేశంలో గత రెండేళ్లలో జరిగిన దాడుల్లో ఆరుగురు అమాయకులు మరణించారు. స్వాతంత్య్ర పోరాటంలో గోరక్షణ ఉద్యమాలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నా, లేకున్నా అందులో రాజకీయాలు మాత్రం ఉన్నాయి. గోరక్షణ కోసం 18, 19 శతాబ్దంలో ప్రాణత్యాగం చేసిన వారిని దేవుళ్లుగా పూజించిన చరిత్ర మనదన్న విషయాన్ని మరచిపోతున్నాం. అమానుషత్వాన్ని ఆహ్వానిస్తున్నాం.

మరిన్ని వార్తలు