ఏజెంట్‌ నిర్వాకం : వీడియో వైరల్‌

13 May, 2019 10:13 IST|Sakshi

పోలింగ్‌ బూతు క్యాప‍్చర్‌ :  ఏజెంట్‌ అరెస్ట్‌

సాక్షి,  ఫరీదాబాద్‌:  సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరవ దశ పోలింగ్‌  సందర్భంగా హరియాణాలో ఓ సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఓటు వేయడానికి మహిళా  ఓటర్లకు బదులుగా  ఓ పోలింగ్ ఏజెంట్‌ స్వయంగా తానే  ఓటు వేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది.   దీంతో స్పందించిన అధికారులు  సంబంధిత పోలింగ్‌  ఏజెంట్‌పై ఫిర్యాదు చేయడంతోచ పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. ఆరో విడుత ఎన్నికల్లో భాగంగా హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గంలోని అసౌటి పోలింగ్ బూత్‌లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలింగ్ బూత్‌లో కూర్చొన్న ఓ ఏజెంట్.. ఈవీఎం కంపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి అక్కడ మహిళ ఉండగానే అతడు ఓటేశాడు. ఇలా ముగ్గురు మహిళల ఓట్లు ఆ పోలింగ్ ఏజెంటే ఓటేసినట్లు అక్కడున్న వారు తెలిపారు. అయితే ఈ తతంగాన్ని అక్కడున్న ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ సంఘటనపై ఫరీదాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. సదరు పోలింగ్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. కేసు నమోదు చేశామని, ముగ్గురు మహిళల ఓట్లు వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. పోలింగ్ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు