‘గాడ్సే కాకపోతే నేను గాంధీని చంపేదాన్ని’

23 Aug, 2018 19:21 IST|Sakshi
దేశంలోనే తొలి హిందూ కోర్టు జడ్జీగా నియమితులైన పూజా శకున్‌ పాండే

అలహాబాద్‌ : ‘ఒకవేళ గాడ్సే, మహాత్మ గాంధీని చంపకపోయి ఉంటే నేనే ఆ పని చేసి ఉండేదాన్ని’ అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త పూజా శకున్‌ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత్‌ హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎమ్‌) అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మీరట్‌లో ఏర్పాటు చేసిన హిందూ కోర్టు ప్రథమ జడ్జీగా పూజా శకున్‌ పాండే నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘నేను, ఏబీహెచ్‌ఎమ్‌ నాథురాం గాడ్సే చేసిన పనిని కీర్తిస్తున్నాను. అంతేకాక నేటి కాలంలో కూడా విభజనను సమర్ధించే గాంధీలు ఉంటే, వారిని వ్యతిరేకించే గాడ్సేలు కూడా ఉంటారు. ఒక వేళ గాడ్సే గాంధీని చంపకపోతే నేనే ఆ పని చేసేదాన్ని’ అని ప్రకటించారు.

గత కొంత కాలంగా ఏబీహెచ్‌ఎమ్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. కేరళ వరదల నేపథ్యంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిలో గొడ్డు మాంసం తినే వారు ఉంటే వారికి సాయం చేయొద్దంటూ ఏబీహెబ్‌ఎమ్‌ నాయకుడు చక్రపాణి మహరాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని హిందూ కోర్టులు: ఏబీహెచ్‌ఎమ్‌
మీరట్‌లో తొలి హిందూ కోర్టును ఏర్పాటు చేసిన ఏబీహెచ్‌ఎమ్‌ త్వరలోనే దేశ వ్యాప్తంగా మరిన్ని హిందూ కోర్టులను ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ఈ హిందూ కోర్టు భూ తగదాలు, ఆస్తి లావాదేవీలు, విడాకుల వంటి అంశాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుందని ఏబీహెచ్‌ఎమ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ శర్మ తెలిపారు. అంతేకాక ఈ ఏడాది అక్టోబర్‌ 2న ఈ హిందూ కోర్టుకు సంబంధించిన నియమ నిబంధనలను, కార్యకలాపాల వివరాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

ఇదిలావుండగా హిందూ కోర్టు ఏర్పాటు విషయంపై అలహబాద్‌ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ కోర్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాలని నోటీసులు కూడా జారీ చేసింది.  

మరిన్ని వార్తలు