ఐదో దశ పోలింగ్‌ : సంపన్న అభ్యర్ధి ఆమే..

1 May, 2019 08:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు సంబంధించి రూ 193 కోట్ల ఆస్తులు ప్రకటించిన పూనం సిన్హా అత్యంత సంపన్న అభ్యర్ధిగా నిలిచారు. సినీ నటుడు, కాంగ్రెస్‌ నేత శత్రుఘ్న సిన్హా భార్య పూనం ఎస్పీ అభ్యర్ధిగా లక్నో నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రూ 177 కోట్ల ఆస్తులతో ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి విజయ్‌ కుమార్‌ మిశ్రా తర్వాతి స్ధానంలో ఉన్నారు. మిశ్రా సీతాపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అత్యంత సంపన్న అభ్యర్ధుల జాబితాలో హజారిబాగ్‌ బీజేపీ అభ్యర్ధి జయంత్‌ సిన్హా రూ 77 కోట్ల ఆస్తులతో మూడో స్ధానంలో ఉన్నారు.

ఐదో విడత పోలింగ్‌లో బరిలో నిలిచిన 668 మంది అభ్యర్ధుల్లో 184 మంది అభ్యర్ధుల ఆస్తులు రూ కోటికి మించాయి. వీరిలో అత్యధికులు బీజేపీ అభ్యర్ధులు కావడం గమనార్హం. అభ్యర్ధుల అఫిడవిట్లను విశ్లేషించిన అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్ధ ఈ వివరాలు వెల్లడించింది. ఇక ఐదో విడత పోలింగ్‌లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల సగటటు ఆస్తి రూ 2.57 కోట్లుగా నమోదైంది. మరోవైపు 264 మంది అభ్యర్ధుల విద్యార్హత ఐదో తరగతి నుంచి ఇంటర్‌ లోపు ఉండటం గమనార్హం. 348 మంది అభ్యర్ధులు గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లుగా ప్రకటించుకున్నారు. మరో 43 మంది తాము అక్షరాస్యులమని పేర్కొనగా, ఆరుగురు అభ్యర్ధులు తాము నిరక్షరాస్యులమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు