కొట్టకండి సారూ...!

10 Dec, 2018 02:36 IST|Sakshi

బడిలో హింసకు గురవుతున్న పేద పిల్లలు 

చికాకునంతా పిల్లలపై రుద్దుతున్న టీచర్లు.. 

ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో వెల్లడి 

అబ్బాయిల్ని గదిలో బంధించి బాదుతారు మా సారు. ఎంతసేపు కొట్టాలనిపిస్తే అంతసేపు కొడతారు. అరుపులు బయటికి విన్పించకుండా ఫోన్‌లో పాటలు పెడతారు 
హెడ్‌మాస్టర్‌ సారు పిడికిలి బిగించి మొహం మీద గట్టిగా కొడతారు. నెత్తురు చిందేలా కొడతారు.
అటు ఇటు తిరుగుతూ, ఆడుతూ,ఒకరితో మరొకరు కలబడుతూ ఉండే పిల్లలను ఆయన అలాగే భయపెడతారు.
ఇవీ ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సాగిస్తున్న అమానుషానికి ఉదాహరణలు. నాలుగు, ఆరో తరగతి చదువుతున్న పిల్లలు ఇచ్చిన వివరాలివీ.. 

సర్కారీ పాఠశాలల్లో కొనసాగుతున్న హింసపై గురుగ్రామ్‌లోని ‘అగ్రసర్‌’అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం జరిపింది. వారి అనుభవాలతో ‘ఊపిరాడని బాల్యం’శీర్షికన నివేదిక రూపొందించింది. పాఠశాలల
ఉపాధ్యాయుల చేతుల్లో పేద పిల్లలు నిత్యం వేధింపులకు, కఠిన శిక్షలకు గురవుతున్న స్థితిని కళ్లకుగట్టింది. 

పేద పిల్లలే బాధితులు 
- బాధిత విద్యార్థుల సంఖ్య పరంగా వివిధ స్కూళ్ల మధ్య వ్యత్యాసముంది. నివేదిక ప్రకారం ఎక్కువ మంది టీచర్లు పిల్లల్ని కొడుతున్నారు. సగటున 43% మంది వారానికి 3 సార్లయినా వారి చేతిలో దెబ్బలు తింటున్నారు.
-  కొన్ని పాఠశాలల్లో 80 నుంచి 100 శాతం పేద పిల్లలు శిక్షల బారినపడుతున్నారు. ప్రతి బడిలో ఒకరిద్దరు క్రూరంగా హింసించే టీచర్లున్నారు. కొన్ని పీరియడ్లలో వారు సామూహిక శిక్షలు విధిస్తారు. 
-  తీవ్ర శిక్షలకు గురవుతున్న పిల్లలంతా పేద కుటుంబాలవారు.. ‘వలస’నేపథ్యమున్న పిల్లలు. తమ కుటుంబాల్లో బడిమెట్లు ఎక్కిన మొదటితరం బిడ్డలు. 
-  91 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడాన్ని ఆమోదిస్తున్నారు. పైగా ఇంట్లో కూడా కొడుతున్నామని 74 శాతం మంది చెబుతున్నారు. స్కూల్లో కొట్టారని చెబితే 70 శాతం పెద్దలు కోపంతో మరింత బాదేస్తున్నారు. 
-  ప్రతి రోజూ భౌతిక హింసతో పాటు మానసిక హింసకు గురవుతున్నారు అత్యధికులు. 53 శాతం విద్యార్థులు తమను అసలు కొట్టొద్దని అభ్యర్థిస్తున్నారు. దెబ్బలు తింటున్నందుకు అవమానపడిపోతూ.. బడి అంటే భయపడిపోతూ.. బడి, చదువు పట్ల వ్యతిరేక భావనలకు లోనవుతున్నారు. 
-  ఆడపిల్లలను.. వయసు, బరువు, రూపురేఖలు, పెళ్లి వంటి అంశాలను అడ్డంపెట్టుకుని మాటలతో అవమానిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమ్మాయిలకంటే అబ్బాయిలు ఎక్కువ దెబ్బలు తింటున్నారు. 

చట్టాల అమలేదీ? 
విద్యాహక్కు చట్టం– 2009, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మార్గదర్శకాలు, ఐరాస బాలల హక్కుల ఒప్పందం సహా మొత్తం 15 పాలసీలు/ ప్రణాళికలు పిల్లలపై హింసను నిషేధించాయి. సంస్కరణ పేరిట విద్యలో‘శిక్ష’ను భాగం చేయకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 65 శాతం మంది పిల్లలు టీచర్ల చేతిలో హింసకు గురవుతున్నారు. బడిలో కొనసాగుతున్న మానసిక హింసను కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టిన బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌.. 99.9 శాతం పిల్లలు బడిలో హింస బారినపడుతున్నారని తేల్చింది. 

హింస వెనుక.. 
- ‘వలస’కుటుంబాల పిల్లలు కావడంతో వివక్షకు గురవుతున్నారు. వీరి తల్లిదండ్రులు అసంఘటిత రంగ శ్రామికులు. పిల్లలతో హోంవర్క్‌ చేయించలేని నిరక్షరాస్యులు. పిల్లలు బడిలో దెబ్బలు తినేందుకు ఇదే మొదటి కారణమవుతోంది. వృత్తిపరమైన శిక్షణ లేని టీచర్లకు.. నేర్చుకోవడంలో పిల్లలకు ఎలా సాయపడాలో తెలియదు. ప్రత్యామ్నాయ క్రమశిక్షణ పద్ధతుల గురించి అవగాహనే లేదు. దీనికితోడు.. మౌలిక సదుపాయాలలేమి, పని పరిస్థితులు విసిరే సవాళ్లు వారు విసిగిపోయేందుకు కారణమవుతున్నాయి. తమ చికాకునంతా పిల్లలపై చూపిస్తున్నారు. 
పిల్లలను లక్ష్యపెట్టని, వారిని మనుషులుగా చూడలేని, వారి హక్కులను గుర్తించలేని సామాజిక వాతావరణం ఈ హింసకు ఒక కారణమవుతోంది. దీనిలో మార్పు తీసుకురావాల్సిన, చట్టాలను అమలు చేయాల్సిన అవసరముందని నివేదిక చెప్పింది. 
హింస తాలూకు గాయాలు పిల్లలను జీవితాంతమూ వెన్నాడుతాయన్నారు ఈ నివేదికకు ముందుమాట రాసిన బాలలహక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ శాంతాసిన్హా. 

అవమానంతో ఆత్మహత్య 
ఢిల్లీలో 12 ఏళ్ల బాలిక పాఠశాలలో ఎదురైన అవమానం భరించలేక ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. స్కూలు టీచర్‌ కొట్టడం వల్లే తన కూతురు అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె తల్లి ఆరోపిస్తోంది. డిసెంబర్‌ 1న బడికి వెళ్లేందుకు నిరాకరించిన ఆ బాలిక.. తన ఆత్మహత్య విషయాన్ని స్కూలుకు తెలపాలంటూ చేతులపై సూసైడ్‌ నోట్‌ రాసింది. వేరే బడిలో చేర్పించాల్సిందిగా అంతకు ముందురోజు రాత్రి తల్లిని కోరింది.  

మరిన్ని వార్తలు