ముంబైలో దారుణం.. మనసుల్ని కలచి వేస్తోన్న విషాదం

11 Jun, 2020 12:50 IST|Sakshi
హర్షల్ నెహెతే తల్లి టీనీ నెహెతే, నాయనమ్మ మాలతి నెహెతే(ఫైల్‌ఫోటో)

ముంబై: పూణెలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న హర్షల్ నెహెతే కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం హర్షల్‌ భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది.. త్వరలోనే వారి ఇంటికి మరో చిన్నారి అతిథి రాబోతున్నారు. తన కోసం కుటుంబం అంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంది. ఇలాంటి సంతోష సమయంలో బిడ్డ కంటే ముందుగానే పిలవని అతిథిగా కరోనా వారి ఇంటికి వచ్చింది. ముందుగా హర్షల్‌ తండ్రి తులసిరామ్‌కి కరోనా సోకింది. అతడిని నాసిక్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. తండ్రి ఆరోగ్యానికి డోకా లేదు అనుకునే లోపు నాయనమ్మ మాలతి నెహెతేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెను జల్‌గావ్‌ సివిల్‌ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ నెల 2 నుంచి ఆమె కనిపించడం లేదని ఆస్పత్రి సిబ్బంది హర్షల్‌కు సమాచారం అందించారు. (వూహాన్‌ను అధిగమించిన ముంబై)

నాయనమ్మ గురించి ఆందోళన పడుతుండగానే మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తల్లి టీనా నెహెతేకు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ఆమెను కూడా జల్‌గావ్‌ సివిల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 6 గంటలపాటు ఎదురు చూసినా ఐసీయూ బెడ్‌ లభించకపోవడంతో బుధవారం టీనా మరణించారు. ఈ దుఖంలో ఉండగానే మరో విషాదకర వార్త తెలిసింది. గత ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయిన మాలతి నెహెతే మృతదేహం సగం కుళ్లిపోయిన స్థితిలో జల్‌గావ్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌లో వెలుగు చూసింది. బుధవారం టాయిలెట్‌కు వెళ్లిన ఓ కోవిడ్‌ పేషెంట్‌ పక్క బాత్రూం నుంచి భరించలేనంత దుర్గంధం వెలువడుతుందని ఫిర్యాదు చేయడంతో.. సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా మాలతి మృతదేహం బయటపడింది. అంటే గత 8 రోజులుగా సిబ్బంది ఎవరూ ఆస్పత్రి మరుగుదొడ్లను శుభ్రం చేయలేదని తెలుస్తోంది. (కరోనా భయం.. మానవత్వం దూరం)

అయితే మాలతి కంటే ముందు ఈ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు కోవిడ్‌ రోగులు మరుగుదొడ్డికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు విడిచినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో  సిబ్బంది నిర్లక్క్ష్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర వైద్య విద్య కార్యదర్శి సంజయ్ ముఖర్జీ, జల్‌గావ్‌ డీన్ డాక్టర్ బి ఎస్ ఖైరేతో సహా మరో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా చనిపోయిన తల్లి, నాయనమ్మలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరు కూడా తోడు లేరంటూ హర్షల్‌ విచారం వ్యక్తం చేస్తున్నాడు. తన తల్లి, నాయనమ్మలను చంపింది కరోనా కాదని.. వైద్య సౌకరర్యాల కొరత, అధికారుల నిర్లక్క్ష్యం వల్లే వారు మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు