కరువు నుంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన బగూజీ!

29 Jan, 2020 19:05 IST|Sakshi

పద్మశ్రీ పురస్కార గ్రహీత పోపట్‌రావు బగూజీ పవార్‌

ముంబై: భూమాతను నమ్ముకున్న వాళ్లెవ్వరూ నష్టపోరని.. వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన పోపట్‌రావు బగూజీ పవార్‌. ఒకానొకనాడు కరువుతో అల్లాడిన గ్రామం.. నేడు పచ్చదనంతో నిండిన ఆదర్శ గ్రామంగా మారడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక కార్యకర్త అన్నా హజారే స్ఫూర్తితో ముందుకు సాగి భారత నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ దక్కించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలోని వర్షాభావ ప్రాంతంలో ఉన్న హివారే బజార్‌ అనే గ్రామానికి 1989లో సర్పంచ్‌గా బగూజీ ఎన్నికయ్యారు. హివారే బజార్‌ వరుస కరువులతో అతలాకుతలమై... పంటలు పండక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడేది. అక్కడ ఏడాదికి సగటున 15 ఇంచుల వర్షపాతం మాత్రం నమోదయ్యేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

పాడి కూడా పెంచుకోవాలి..
అటువంటి సమయంలో సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన బగూజీ... ముందుగా అక్కడ కురుస్తున్న కొద్దిపాటి వర్షపు నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలా అన్న అంశంపై దృష్టి సారించారు. అన్నా హజారే విధానాలను అనుసరిస్తూ.. నీటి యాజమాన్య వ్యవస్థను మెరుగుపరిచారు. అంతేగాకుండా గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టారు. ఈ క్రమంలో కేవలం ఏడాది కాలంలోనే లక్షలాది చెట్లతో గ్రామం పచ్చదనం సంతరించుకుంది. దీంతో వర్షపాతం కూడా క్రమక్రమంగా పెరగసాగింది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచే దిశగా కాంటూర్‌ ట్రెంచెస్‌ విధానాల్ని బగూజీ అనుసరించారు. ఒక్క నీటి చుక్క కూడా వృథా కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అదే విధంగా కేవలం వ్యవసాయంపైనే ఆధార పడకుండా ఆవులు, గేదెలు, మేకలు తదితర పశువుల పెంపకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దీంతో అనతికాలంలోనే పాడి ఉత్పత్తి పెరిగి వారు లాభాలు గడించారు. (బత్తాయి పండ్ల వ్యాపారికి ‘పద్మశ్రీ’)

హెచ్‌ఐవీ టెస్టు తప్పనిసరి
కేవలం వ్యవసాయం, నీటి నిర్వహణపైనే కాకుండా గ్రామస్తుల ఆరోగ్యంపై కూడా బగూజీ శ్రద్ధ వహించేవారు. మద్యం కారణంగా అనారోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయంటూ వారిలో చైతన్యం నింపి.. మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. అదే విధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందే హెచ్‌ఐవీ పరీక్ష చేసుకోవాలని నిబంధన విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో దీర్ఘకాలంలో హివారే బజార్‌ ఆదర్శగ్రామంగా రూపుదిద్దుకుంది. ఇక గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన మాజీ సర్పంచ్‌ బగూజీని పద్మశ్రీ వరించింది. కాగా ప్రజాప్రతినిధిగా తనదైన ముద్ర వేసిన బగూజీ ప్రస్తుతం మహారాష్ట్ర మోడల్‌ విలేజ్‌ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు