రఫేల్‌పై తాజా పోస్టర్‌ కలకలం

8 Feb, 2019 16:56 IST|Sakshi

భోపాల్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలక, విపక్ష పార్టీల మధ్య పోస్టర్‌ వార్‌ కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ను రాముడిగా, ప్రధాని నరేంద్ర మోదీని పదితలలతో కూడిన రావణుడిగా చూపుతూ ఏర్పాటైన పోస్టర్‌ కలకలం రేపుతోంది. రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో పాలక బీజేపీని దోషిగా చూపుతూ ఈ పోస్టర్లు వెలిశాయి.

రఫేల్‌ విమానంపై ప్రధాని మోదీ ఫోటోను చూపుతూ ‘ కాపలాదారే దొంగ’ అనే క్యాప్షన్‌ను పొందుపరిచారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్ధానిక నేతలు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఈ తరహా పోస్టర్లను ప్రదర్శించడం వివాదాస్పదమవుతోంది.

బిహార్‌ రాజధాని పట్నాలో ఇటీవల రాహుల్‌ను రాముడిగా చూపుతూ వెలిసిన పోస్టర్లు దుమారం రేపాయి. గత ఏడాది మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు రాహుల్‌ గాంధీని శివభక్తుడిగా చూపే పోస్టర్లు భోపాల్‌లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రియాంక, రాహుల్‌ గాంధీలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ శ్రేణులు కూడా గతంలో పలు నగరాల్లో హోర్డింగ్‌లు, పోస్టర్లను ప్రదర్శించాయి.

మరిన్ని వార్తలు