గ్రిడ్‌ కుప్పకూలే అవకాశమే లేదు

5 Apr, 2020 04:54 IST|Sakshi

ఇళ్లలో దీపాలే ఆర్పుతారు

టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు ఆన్‌లోనే ఉంటాయి

వీధి దీపాలు, ఆసుపత్రుల్లో విద్యుత్తు వినియోగం: స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దేశ ప్రజలందరూ విద్యుత్‌ బల్బులను ఆర్పివేసినా పవర్‌ గ్రిడ్‌ ఏమీ కూలిపోదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. విద్యుత్‌ సరఫరా, డిమాండ్‌లో వచ్చే తేడాలను నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భారతీయులందరి సామూహిక సంకల్ప బలాన్ని ప్రదర్శించేందుకు ప్రధాని ఆదివారం రాత్రి విద్యుత్‌ దీపాలను తొమ్మిది నిమిషాలపాటు ఆర్పివేయాలని కోరిన సంగతి తెలిసిందే.

అయితే ఇలా చేస్తే అకస్మాత్తుగా వినియోగం తగ్గి విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీపాలన్నీ ఆర్పితే దాదాపు 13 గిగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ తగ్గుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు జల, గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గిస్తామని విద్యుత్‌ గ్రిడ్‌ నిర్వహణను చూస్తున్న పవర్‌ సిస్టమ్స్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది. బొగ్గు, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్లను తగు విధంగా పనిచేయించడం ద్వారా అత్యధిక స్థాయి డిమాండ్‌ను అందుకునేందుకు ఏర్పాట్లు చేశామని పవర్‌ సిస్టమ్‌ కార్పొరేషన్‌ తెలిపింది. 

దేశీ విద్యుత్తు వ్యవస్థ పటిష్టంగా ఉందని, వోల్టేజీలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు తగిన పద్ధతులు పాటిస్తామని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌ రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలకు లేఖ రాశారు. ఇళ్లల్లో దీపాలను మాత్రమే ఆర్పివేయాల్సిందిగా మోదీ కోరారని, వీధి దీపాలు, కంప్యూటర్, టీవీ, ఫ్యాన్, ఫ్రిజ్‌ వంటివి నడుస్తూనే ఉంటాయని తెలిపారు. ఆసుపత్రులు, ఇతర ప్రజా సంబంధిత వ్యవస్థల్లోనూ విద్యుత్తు వినియోగం ఉంటుందని గుర్తు చేశారు. ఆదివారం రాత్రి నాటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడులు రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య లోడ్‌ షెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఆదివారం రాత్రి విద్యుత్తు డిమాండ్‌ పది నుంచి పన్నెండు గిగావాట్ల మేర తగ్గే అవకాశముందని ఇది గ్రిడ్‌ కూలిపోయేంత స్థాయిదేమీ కాదని అధికారులు కొందరు తెలిపారు.  

మరిన్ని వార్తలు