గ్యాంగ్‌మెన్లకు ‘రక్షణ’

8 Nov, 2014 23:35 IST|Sakshi

 సాక్షి, ముంబై: తమ ప్రాణాలను ఫణంగాపెట్టి రైలు పట్టాలపై పనిచేస్తున్న గ్యాంగ్ మెన్‌లకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రైల్వే ఓ వినూత్న పరికారాన్ని ప్రవేశపెట్టింది. ముంబై రీజియన్‌లోని రైల్వే వర్క్ షాపులో ఈ అధునిక విద్యుత్ సేఫ్టీ పరికరం రూపుదిద్దుకుంది. ఈ సేఫ్టీ పరికరాన్ని పట్టాలపై అమరిస్తే చాలు..  రైలు కిలోమీటరు దూరంలో ఉండగానే గుర్తించి పెద్దగా శబ్దం చేస్తుంది. దీంతో వారు రైలు పట్టాలకు దూరంగా సురక్షితంగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఏ కాలంలోనైనా రైలు పట్టాల వెంబడి తిరుగుతూ వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత గ్యాంగ్ మెన్‌లపై ఉంది. వీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా రైలు ప్రమాదాలు జరగడం ఖాయం. దీంతో ప్రమాదాలను నివారించే ఈ గ్యాంగ్ మెన్‌లు పలుమార్లు ప్రమాదాలకు లోనైన ఘటనలున్నాయి.  గడిచిన మూడేళ్ల కాలంలో దాదాపు 40 గ్యాంగ్ మెన్‌ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సాధారణంగా వీరు పనిచేస్తున్న రైల్వే ట్రాక్‌కు కొంత దూరంలో ఓ వ్యక్తి చేతిలో జెండా పట్టుకుని నిలబడతాడు.

 రైలు కొద్దిదూరంలో ఉండగానే గట్టిగా ఈల వేసి గ్యాంగ్ మెన్‌లను అప్రమత్తం చేస్తాడు. ఎరుపు రంగు జెండా చూపుతూ రైలు వేగాన్ని తగ్గించాలని సైగ చేస్తాడు. అయినప్పటికీ అనేక సంఘటనలో మానవ తప్పిదంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా నివారించేందుకు ఆధునిక విద్యుత్ సేఫ్టీ పరికరాన్ని ముంబై రీజియన్ కనిపెట్టింది.

ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉరుకులు పరుగులుతీసే ముంబైలాంటి నగరంలో ప్రతీ మూడు, లేదా నాలుగు నిమిషాలకు ఒక రైలు వస్తూ, పోతుంటుంది. అటువంటి ఈ రైల్వే ట్రాక్‌లపై గ్యాంగ్ మెన్‌లు పనిచేయాలంటే కత్తిమీద సాము లాంటిదే. ఆ పరికరాన్ని వీరు పనిచేస్తున్న ట్రాక్‌పై అమరిస్తే చాలు.. దానికున్న సెన్సార్‌వల్ల రైలు కిలోమీటరు దూరంలో ఉండగానే అలర్మ్ మోగుతుంది. దీంతో వారు అప్రమత్తమైతారని సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ అన్నారు. ఈ పరికరం కేవలం 500 గ్రాముల బరువు ఉండడంవల్ల గ్యాంగ్ మెన్‌లు తమ వెంట సులభంగా తీసుకెళ్లవచ్చని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు