చీకటి చదువులు.. ఇంకెన్నాళ్లు?

1 Apr, 2018 12:14 IST|Sakshi

రాయ్‌పూర్‌ : దేశవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. చత్తీస్‌ఘడ్‌లోని ఓ గ్రామంలో మాత్రం గత కొన్నేళ్లుగా విద్యార్థులు సవాళ్లు ఎదుర్కుంటున్నారు. చిమ్మచీకటిలో లాంతరు వెలుగుల మధ్య చదువుకోవాల్సిన పరిస్థితి వాళ్లది. బలరాంపూర్‌ జిల్లాలోని త్రిశూల్‌ గ్రామంలో పరిస్థితి ఇది. 

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా కూడా ఈ గిరిజన గ్రామానికి  కరెంట్‌ సరఫరా లేదు. జిల్లా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని అయినా కూడా పరిస్థితి మారలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నామని.. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అయితే గ్రామానికి 15 కి.మీ దూరంలో ఉ‍న్న బీజేపీ ఎంపీ రాంవిచార్‌ నేతమ్‌ ఇంటికి మాత్రం నిత్యం కరెంట్‌ సరఫరా ఉండటాన్ని వారు ప్రస్తావించారు. మరోవైపు గ్రామంలో ప్రైమరీ ఎడ్యూకేషన్‌ ప్రారంభించినాకూడా సరైన రోడ్డు సదుపాయం లేక విద్యార్థులు  ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కరు కూడా పాస్‌ కాలేదు.. ఇప్పటివరకూ ఈ గ్రామంలో ఒక్కరు కూడా పదోతరగతి పాస్‌ అవ్వలేదని గ్రామస్థులు చెబుతుండగా, కరెంట్‌ లేకపోవడంతో సరిగ్గా చదవలేక ఫెయిల్‌ అవుతున్నట్లు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం.

త్వరలో సమస్యకు పరిష్కారం.. పొరుగునే ఉన్న బుండిపాకు గ్రామానికి కరెంట్‌ సరఫరా ప్రారంభించామని.. త్వరలోనే త్రిశూల్ గ్రామానికి కూడా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్‌ అవినాష్‌ కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు