‘ఆ శబ్దాన్ని నేను కూడా విన్నాను’

16 Feb, 2019 10:34 IST|Sakshi

లక్నో : ఆర్మీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వచ్చిన మెసేజ్‌ చూడగానే షాక్‌ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. రెండు నిమిషాల ముందు వరకూ తనతో మాట్లాడిన మనిషి ఇప్పుడు చనిపోవడం ఏంటని ఆలోచిస్తుంది. ఇదంతా అబద్ధమైతే బాగుండని కోరుకుంటుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. ముష్కరులు దాడిలో ఆమె భర్త మరణించాడు. దాంతో గుండెలవిసేలా విలపిస్తోంది నీర్జా.

గురువారం పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లలో నీర్జ భర్త ప్రదీప్‌ కుమార్‌ కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన ప్రదీప్‌(30) సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. గురువారం దాడి జరగడానికి ముందు వరకూ కూడా ప్రదీప్‌ తన భార్య నీర్జాతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. తన గారల పట్టి మాన్య ఏం చేస్తుందని అడిగాడు ప్రదీప్‌. సమాధానం చెప్పేలోపే అవతలి వైపు నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది నీర్జాకు. రెండు సెకన్లలో ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ అయ్యింది. ఏదైనా సమస్య వచ్చిందేమో.. తర్వాత తనే కాల్‌ చేస్తాడు అనుకుంది నీర్జా.

కానీ మరో రెండు నిమిషాల్లో ఆర్మీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఆమెకు ఓ సందేశం వచ్చింది. ‘సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ప్రదీప్‌ వీర మరణం పొందార’నేది దానిది సారాంశం. ఇది వినగానే ఒక్కాసారిగా షాక్‌ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. ఇప్పటివరకూ నాతో ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి కేవలం రెండు నిమిషాల్లో మరణించడం ఏంటనుకుంది నీర్జా. కాసేపట్లో న్యూస్‌ చానెల్స్‌లో ఎక్కడ చూసిన ఈ వార్తలే. దాంతో తాను విన్నది నిజమే అని గ్రహించిన నీర్జా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

తన భర్త ఇక రాడని తెలిసి కన్నీరుమున్నిరుగా విలపిస్తుంది నీర్జా. ‘ప్రదీప్‌కు చిన్న కూతరు మాన్య అంటే చాలా ఇష్టం. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కూడా మాన్య గురించే అడిగాడు. నేను సమాధానం చెప్పేలోపే ఫోన్‌ కట్టయ్యింది. ఇంత దారుణం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదం’టూ ఏడుస్తోంది నీర్జా. 2004లో సీఆర్పీఎఫ్‌లో చేరిన ప్రదీప్‌ 115వ బెటాలియన్‌లో విధులు నిర్వహించేవాడు.

మరిన్ని వార్తలు