‘సినిమా షూటింగ్‌లకు త్వరలో మార్గదర్శకాలు’

7 Jul, 2020 19:39 IST|Sakshi

న్యూఢిల్లీ : సినిమా ఇండస్ట్రీకి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిలిచిన పోయిన సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌‌ వెల్లడించారు. కేంద్ర మంత్రి మంగళవారం ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ)2020’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సినిమా, టీవీ, గేమింగ్‌ వంటి  వివిధ విభాగాలకు వేర్వేరు మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. కాగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమలో షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల సడలింపులిచ్చినా.. సినీ పరిశ్రమకు మాత్రం అందులో ఊరట దక్కలేదు.(ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు) 

‘మహమ్మారి కారణంగా నిలిచిపోయిన షూటింగ్‌లను తిరిగి ప్రారంభించడానికి కావాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది. టీవీ సీరియల్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, కో-ప్రోడక్షన్‌, యానిమేషన్‌, గేమింగ్‌తో సహా అన్ని ప్రొడక్షన్‌లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో ముందుకు రాబోతుంది. దీని గురించి త్వరలో ప్రకటిస్తాం’. అని పేర్కొన్నారు. అలాగే సినిమా రంగంలో వ్యాపారవేత్తలు మరింత పెట్టుబడులు పెట్టి పరిశ్రమను ముందుకు తీసుకు పోవాలని కోరారు. 80 మందికి పైగా విదేశీ చిత్ర నిర్మాతలు తమ సినిమాలను భారత్‌లో చిత్రీకరించేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ లభించిందని ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. (షూటింగ్‌లు ఇలా.. మార్గదర్శకాలు విడుదల)

మరిన్ని వార్తలు