మోదీ 2.ఓ : ఆ నిర్ణయం అసాధారణం

8 Sep, 2019 17:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో రెండోసారి కొలువుతీరిన ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో దేశ పురోగతికి దోహదపడే అసాధారణ నిర్ణయాలు తీసుకుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. గత వంద రోజుల్లో ఆర్టికల్‌ 370, 35 ఏ రద్దు నిర్ణయమే అత్యంత సాహసోపేతం, అసాధారణమని ఆయన కొనియాడారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసి 35 రోజులు గడిచినా కశ్మీర్‌లో చిన్నపాటి ఘటనలు మినహా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుర్తుచేశారు. కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తేందుకు ప్రయత్నించినా మోదీ ప్రభుత్వ నిర్ణయానికి యావత్‌ ప్రపంచం బాసటగా నిలిచిందని ప్రశంసించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనం భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపబోదని జవదేకర్‌ అన్నారు. గడిచిన 100 రోజుల్లో మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల డాలర్లకు చేర్చే దిశగా పలు చర్యలు చేపట్టిందని చెప్పారు. ఆదాయ పన్ను, జీఎస్టీలో ప్రభుత్వం పలు మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌పై నిషేధం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన వంటి పథకాలతో దేశ పురోగతికి మ్దోదీ ప్రభుత్వం బాటలువేసిందని అన్నారు.

మరిన్ని వార్తలు