కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్‌

23 May, 2019 16:09 IST|Sakshi

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్‌ ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా నిలబడిన  ప్రకాష్ రాజ్‌ కనీస పోరాటపటిమ చూపించలేకపోయారు. ఈ స్థానం నుంచి పోటి చేసిన బీజేపీ అభ్యర్థి 6 లక్షలకు పైగా ఓట్లు సాధించగా ప్రకాష్‌ రాజ్‌కు కనీసం 30 వేల ఓట్లు కూడా రాలేదు.

లెక్కింపు పూర్తి కాకముందే తన ఓటమి గురించి తెలుసుకున్న ప్రకాష్ రాజ్‌ కౌటింగ్‌ కేంద్ర నుంచి వెళ్లిపోయారు. ఫలితాలపై ట్విటర్‌లో స్పందించారు. ‘బలమైన చెంపదెబ్బ.. ఇక నాపై మరిన్ని అవమానాలు, ట్రోల్స్‌ వస్తాయి. అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. సెక్యులర్‌ ఇండియా కోసం నా పోరాటం కొనసాగుతుంది. ముందున్నదంతా కఠిన ప్రయాణం’ అంటూ ట్వీట్ చేశారు.

గత పదేళ్లుగా పీసీ మోహన్ బెంగళూరు సెంట్రల్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ తరుపున బరిలో ఉన్న రిజ్వాన్‌ అర్షద్‌కు 5 లక్షల 30 వేలకు పైగా ఓట్లు పోల్‌ అయ్యాయి. తన స్నేహితురాలు, జర్నలిస్ట్‌ అయిన గౌరీ లంకేష్ హత్య విషయంలో తీవ్రంగా స్పందించిన ప్రకాష్ రాజ్‌, గౌరీ హత్య తరువాతే తనలో సామాజిక బాధ్యత మరింత పెరిగిందంటు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే తొలి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌ను ప్రజలు తిరస్కరించారు.


మరిన్ని వార్తలు