ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌

11 Feb, 2020 18:55 IST|Sakshi

బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘సామాన్యుడి’కి అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలను ప్రశంసిస్తూనే.. బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు... ‘‘రాజధాని శిక్ష.. బుల్లెట్లు పేల్చేవాళ్లను.. చీపురుతో కొట్టారు. షాక్‌ తగిలిందా?’’అని ఆయన ట్వీట్‌ చేశారు. అదే విధంగా.. ‘‘పేరున్న వాళ్లను.. బద్నాం చేసే వాళ్లను కాకుండా.. కేవలం పనిచేసే వారిని మాత్రమే గెలిపించారు. థాంక్యూ ఢిల్లీ’’ అని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాశ్‌ రాజ్‌ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ తీరుపై అనేకమార్లు విమర్శలు గుప్పించారు.

చదవండి: హస్తిన తీర్పు: ఆప్‌ 62.. బీజేపీ 8

కాగా ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న 70 స్థానాల్లో ఎన్నికల్లో... ఆప్‌ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క స్థానంలో కూడా గెలుపొందని కాంగ్రెస్‌ పార్టీ.. పలు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. మరోవైపు వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనకు అఖండ విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన హనుమాన్‌ మందిర్‌కు వెళ్లి దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్‌ తీసుకోనున్నారు.

ఇది ఢిల్లీ ప్రజల విజయం : కేజ్రీవాల్‌

>
మరిన్ని వార్తలు