నేడు గోవా సర్కార్‌కు ‘పరీక్ష’

20 Mar, 2019 02:06 IST|Sakshi

ఉదయం 11 గంటలకు ముహూర్తం

నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి 2 గంటలకు సీఎంగా ప్రమాణం చేసిన ప్రమోద్‌

బలపరీక్షలో నెగ్గుతాం: సీఎం

పణజీ: గోవాలో ఆదివారం రాత్రి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అనూహ్యంగా సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు కొత్త ముఖ్యమంత్రిగా అసెంబ్లీ స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం బుధవారమే అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇందుకోసం గవర్నర్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేకంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేశారని ఓ అధికారి తెలిపారు. విశ్వాసపరీక్షలో తామే నెగ్గుతామని సీఎం సావంత్‌ చెప్పారు. గోవా అసెంబ్లీలో మొత్తం స్థానాలు 40 కాగా, ప్రస్తుత సభ్యుల సంఖ్య 36. ఇక కొత్త ప్రభుత్వానికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తాజా లెక్కల ప్రకారం బీజేపీకి సొంతంగా 12 మంది, ఎంజీపీ, జీఎఫ్‌పీలకు చెరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు  ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. 

నాటకీయ పరిణామాల నడుమ 
అంతకుముందు సోమవారం సాయంత్రం నుంచి గోవాలో బీజేపీ, దాని మిత్ర పక్షాల మధ్య చర్చలు, నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. అనేక దఫాల చర్చల అనంతరం ఎట్టకేలకు అర్ధరాత్రి 2 గంటలకు ప్రమోద్‌ సావంత్‌ చేత గవర్నర్‌ మృదులా సిన్హా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మనోహర్‌ పరీకర్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారినే కొత్త మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే.  

అమిత్‌ షా, గడ్కరీ చాణక్యం 
కొత్త సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై బీజేపీ, మిత్ర పక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రాలేదు. చివరకు బీజేపీకి సీఎం పదవి, ఎంజీపీ, జీఎఫ్‌పీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. జీఎఫ్‌పీకి చెందిన విజయ్‌సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్‌ ధవలికర్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకుంది. దీంతో రాత్రి 11 గంటలకే ప్రమాణ స్వీకారం ఉంటుందని తొలుత బీజేపీ ప్రకటించినా ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ మళ్లీ వాయిదా వేశారు. అనంతరం అర్ధరాత్రి 2 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, గోవా బీజేపీ సమన్వయకర్త గడ్కరీలు చక్కబెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కలిసిన తరుణంలో అధికారం బీజేపీ చేజారకుండా వీరు పావులు కదిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికలప్పుడు సైతం గోవాలో హంగ్‌ అసెంబ్లీ రాగా, అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు కాదని బీజేపీకి అధికారం దక్కేలా చేయడంలో గడ్కరీ కీలక పాత్ర పోషించారు.

ఆయుర్వేద వైద్యుడికి సీఎం పదవి 
పరీకర్‌కు విశ్వాసపాత్రుడిగా ప్రమోద్‌ సావంత్‌ (46)కు మంచి పేరుంది. ఉత్తర గోవాలోని సంఖాలిమ్‌ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఆరెస్సెస్‌లోనూ పనిచేశారు.. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌ ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించిన ప్రమోద్‌ కొంతకాలం వైద్యుడిగానూ పనిచేశారు. బీజేపీలో యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పరీకర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉండేవాడు. ప్రమోద్‌కు పెద్దగా రాజకీయ అనుభవం లేనప్పటికీ, ఆయనకు ఎవరూ పోటీ లేకపోవడంతో సులభంగానే ముఖ్యమంత్రి పదవి దక్కిందని చెప్పవచ్చు.  

మరిన్ని వార్తలు